దానిని కోదండ రామ్ కూడా వ్యతిరేకిస్తున్నారు
posted on Aug 4, 2015 8:18AM
.jpg)
చారిత్రాత్మకమయిన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించాలనే తెలంగణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలని ప్రతిపక్షాలే కాదు ఉద్యమ సమయంలో ఆయనకి తోడుగా నిలిచి పోరాడిన తెలంగాణా రాజకీయ జేఎసీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీ-జేఎసీ చైర్మన్ ప్రొఫెస్సర్ కోదండరాం తదితరులు నిన్న ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు.
తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఉస్మానియా ఆసుపత్రిని ఎప్పటికప్పుడు మరమత్తులు చేయకపోవడం వలననే భవనాలు కొంతమేర పాడయ్యాయి తప్ప పూర్తిగా శిధిలమయిపోలేదు. ఈ భవనాలకు మరమత్తులు చేయించాలనే శ్రద్ధ ప్రభుత్వానికి కోరవడినందునే ఈ దుస్థితికి చేరుకొన్నాయి. ఇప్పటికయినా ప్రభుత్వం ఉస్మానియా భవనాలను మరమత్తులు చేయించి వాటిని కాపాడుకోవాలి,” అని అన్నారు.
ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయవద్దని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేరుగా చెప్పకపోయినా, ఆయన మాటలకు అర్ధం అదే. కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషను కూడా పడింది. ప్రతిపక్షాలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళితే దాని వలన సమస్యలను కోరుండి కొని తెచ్చుకొన్నట్లే అవుతుంది. ఇదివరకు సచివాలయం కొత్త భవనం నిర్మాణం కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిని, దానిపక్కనే ఉన్న ఒక చారిత్రక కట్టడాన్ని కూల్చివేయాలనుకొన్నప్పుడు కూడా ప్రజలు, ప్రతిపక్షాల నుండి ఇటువంటి నిరసనలే ఎదురయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన భూములలో పేదవారికి ఇళ్ళను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించినప్పుడు కూడా ఇదే విధంగా నిరసనలు ఎదుర్కొని చివరికి వెనక్కి తగ్గవలసి వచ్చింది. కనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రతిపక్షాలను, తెలంగాణా పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలనుకొంటున్న టీ-జెఎసి నేతలను కూడా సంప్రదిస్తే ఇటువంటి అవమానకర పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించవచ్చునని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.