లోక్ సభలో టూధర్డ్స్ మెజారిటీ కోసం బీజేపీ వ్యూహంలో బలిపశువులు విపక్ష రెబల్సే!

posted on: Jun 20, 2026 2:14PM

కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే  కీలకమైన రాజ్యాంగ బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందాలంటే.. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహాలకు పదును పెట్టి సొంతంగా మెజారిటీ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.  లోక్‌సభలో కేవలం సాధారణ మెజార్టీతో సరిపెట్టుకోకుండా, ఏకంగా రెండు బై మూడు వంతుల తిరుగులేని మెజార్టీని సాధించాలని భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దేశ భవిష్యత్తును మార్చే డీలిమిటేషన్  అదే నియోజకవర్గాల పునర్విభజన , అలాగూ మహిళా రిజర్వేషన్ వంటి   కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా..  స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం. ఇండియా కూటమి ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో, అధికార ఎన్డీఏ కూటమి తన రూట్‌ను పూర్తిగా మార్చేసింది.

ప్రస్తుతం 540 మంది సభ్యులు ఉన్న లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీల బలం ఉంది. అయితే, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే సభలో కనీసం 360 మంది ఎంపీల (అనగా 2/3 వంతు) మద్దతు తప్పనిసరి.   ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీఏ కూటమికి ఇంకా 67 మంది ఎంపీల కొరత స్పష్టంగా ఉంది. ఈ భారీ అంతరాన్ని ఎలాగైనా అధిగమించేందుకు బీజేపీ చాణక్య వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్త, రెబల్ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు తెర వెనుక వేగంగా పావులు కదుపుతోంది.

ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ప్రధానంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలపై బీజేపీ  దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు, అలాగే మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నుంచి  6గురు ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సొంత పార్టీలపై అసంతృప్తి,  వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలే ఈ పరిణామాలకు ప్రధాన కారణాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల నుండి ఆశించిన విధంగా 26 మంది ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరితే, అప్పుడు కూటమి   బలం 319 స్థానాలకు చేరుకుంటుంది.

అయినప్పటికీ లక్ష్యానికి ఇంకా 41 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. ఈ మిగిలిన లోటును భర్తీ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ పై బీజేపీ చూపు పడింది. యూపీలో అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్‌లతో కూడిన సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీల బలం ఉంది. అయితే అక్కడ అంతర్గత విభేదాలు, టికెట్ల పంపకాలపై అసంతృప్తి, స్థానిక నాయకత్వ వివాదాల కారణంగా కొందరు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్.  వీరిలో కనీసం 10 నుండి 15 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇచ్చినా కూటమి బలం 330 నుండి 335 మార్కును తాకుతుంది. అప్పుడు కేవలం పాతిర నుండి 30 స్థానాల  అంతరం మాత్రమే మిగులుతుంది, దీనిని ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్రుల ద్వారా సులభంగా సాధించవచ్చని బీజేపీ యోచన.

ఈ వ్యూహం గనుక నూటికి నూరు శాతం ఫలించి ఎన్డీఏకు 2/3 మెజార్టీ వస్తే, దేశంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. డీలిమిటేషన్ వంటి సున్నితమైన అంశాలను ప్రతిపక్షాల ఆందోళనలతో నిమిత్తం లేకుండా ముందుకు తీసుకెళ్లవచ్చు. అయితే, ఈ వ్యూహం వెనుక చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలు కూడా  ఉన్నాయి.  ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఇలా ఎంపీలను ఆకర్షించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో..  ఉత్తరాది ఎంపీల బలంతో ఈ బిల్లులను ఆమోదిస్తే దేశంలో ఉత్తర-దక్షిణ విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...