ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ఆపరేషన్...66 మంది అరెస్ట్

posted on: May 20, 2026 5:15PM

 

సైబర్ నేరాలకు కీలకంగా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల దందాపై హైదరాబాద్ సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ చేపట్టింది. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో నిర్వహించిన ఈ చర్యల్లో 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు జరిపి 66 మందిని అరెస్ట్ చేసి పెద్ద నెట్‌వర్క్‌ను ఛేదించారు. గతంలో మ్యూల్ అకౌంట్లపై “ఆపరేషన్ ఆక్టోపస్ 1.0”, బ్యాంకు అధికారుల పాత్రపై “ఆపరేషన్ ఆక్టోపస్ 2.0” చేపట్టిన పోలీసులు ఇప్పుడు సైబర్ నేరాలకు వెన్నెముకగా మారిన ఘోస్ట్ సిమ్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోగా, వాటిలో 432 సీల్డ్ సిమ్‌లు, 112 యాక్టివ్ సిమ్‌లు ఉన్నాయి. అరెస్టైన వారిలో 44 మంది ఈ సిమ్‌ల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సరఫరాదారులు ఉన్నారు. వీరు దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములై సుమారు రూ.101.87 కోట్ల మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన PoS ఏజెంట్లలో వోడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్‌టెల్‌కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.

విచారణలో బయటపడిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త సిమ్ తీసుకునేందుకు లేదా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం వచ్చిన వినియోగదారుల నుంచి తెలియకుండా అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెట్‌వర్క్ సమస్యలు, సర్వర్ డౌన్ వంటి కారణాలు చూపుతూ ఒకే వ్యక్తి నుంచి పలుమార్లు బయోమెట్రిక్ తీసుకుని అనేక సిమ్‌లు యాక్టివేట్ చేస్తున్నట్లు తేలింది. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత ఇంటర్నెట్ ఇస్తామంటూ ఆశ చూపించి నిరక్షరాస్యులు, నిరుపేదల ఆధార్ వివరాలతో పెద్ద ఎత్తున సిమ్ కార్డులు సృష్టించినట్టు విచారణలో తెలిసింది. 

ఎక్కువ సిమ్‌లు అమ్మితే ఎక్కువ కమిషన్ రావడంతో పాటు సైబర్ ముఠాల నుంచి డబ్బులు అందుతుండటంతో ఈ దందా విస్తరించినట్టు పోలీసులు తెలిపారు. అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్‌లను వెంటనే ఇ-సిమ్‌లుగా మార్చి విదేశాల్లో ఉన్న ప్రధాన సైబర్ ముఠాలకు పంపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఆ ముఠాలు భారత నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరచి మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి అమాయకులను వలలో వేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయి. సెక్స్‌టార్షన్, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల్లో కూడా ఇదే నంబర్లు ఉపయోగిస్తున్నారని తెలిపారు. నంబర్ భారతదేశానికి చెందినదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ త్వరలో టెలికాం సంస్థల ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. కేవైసీ ప్రక్రియను కఠినతరం చేయడం, PoS ఏజెంట్లపై నిఘా పెంచడం, రియల్ టైమ్ వెరిఫికేషన్ అమలు చేయడం, సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్‌లను వెంటనే డీయాక్టివేట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, OTPలను ఎవరితోనూ పంచుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తమ పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ పోర్టల్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...