ఆన్‌లైన్ లోన్ మోసాల ముఠా గుట్టు రట్టు... ఐదుగురు అరెస్ట్
posted on: Feb 11, 2026 3:58PM

సోషల్ మీడియా వేదికగా సులభంగా లోన్లు ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన వారు బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పు గొండ తరుణ్, చుక్క శ్యామ్. వీరంతా వరంగల్ జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు.హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ గత ఏడాది నవంబర్ 6న ఇన్‌స్టాగ్రామ్ లో కనిపించిన లోన్ ప్రకటన ను ఓపెన్ చేసి వెంటనే మూసివేశారు.
అయితే మరుసటి రోజే ఆమెకు ఓ అపరిచిత మొబైల్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను “ముద్రా లోన్ సర్వీసెస్” అధికారి కిలా పవన్ కుమార్‌గా పరిచయం చేసుకుని, ఆమె పేరుమీద రూ.3 లక్షల లోన్ మంజూ రైందని తెలిపాడు. ఎటు వంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని మాయమాటలు చెప్పి నమ్మించి... ఆమె ఆధార్, పాన్ కార్డు వివరాలు సేకరించారు. అనంతరం ఇన్సూరెన్స్ ఛార్జీలు, టీడీఎస్, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి పేర్లతో విడతల వారీగా డబ్బులు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో బాధితురాలి నుంచి మొత్తం రూ.1,08,274 వసూలు చేశారు. లోన్ వద్దని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ‘క్యాన్సిలేషన్ ఫీజు’ పేరుతో మరిన్ని డబ్బులు అడగడంతో మోసపోయా నని ఆమెకు అర్థం అయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నం. 2220/2025గా నమోదు చేసి ఐటీ చట్టంలోని 66C, 66D సెక్షన్లు మరియు బీఎన్ఎస్ 318(4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆన్‌లైన్ లోన్ వెబ్‌సైట్లు రూపొందించి సోషల్ మీడియాలో విస్తృ తంగా ప్రకటనలు ఇస్తు న్నట్లు తేలింది. “ముద్రా లోన్” సహా పలు ప్రభుత్వ పథకాల పేర్లు వాడుతూ, ఎటువంటి వడ్డీ లేకుండా తక్షణ రుణాలు అంది స్తామని ఆకర్షణీయ ప్రకటనలు చేసేవారు. ప్రకటనలకు స్పందించిన వారి వివరాలను సేకరించి రాష్ట్రాల వారీగా విభజిం చేవారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితుల వివరాలను ఈ నిందితులకు అందించేవారు.
కోల్‌కతా, ఢిల్లీ ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులకు ఫోన్ చేసి వివిధ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ యువకులు చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులు చేసేవారని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదిం చాలనే ఆశతో ఫేస్‌బుక్ ప్రకటనల ద్వారా ‘రాహుల్’ అనే వ్యక్తిని సంప్రదించి ఈ అక్రమ కాల్ సెంటర్లలో చేరారు. కృష్ణ @ కిట్టు అనే మేనేజర్ కోల్‌కతాలో వసతి కల్పించి మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
రోజుకు 180 నుంచి 200 వరకు కాల్స్ చేస్తూ బాధితు లను వలలో వేసేవారు. వసూలైన మొత్తంలో వీరికి 30 శాతం కమిషన్ లభించేది.ఈ దాడుల్లో పోలీసులు 8 మొబైల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియాలో సులభంగా లోన్లు ఇస్తామనే ప్రకటనలను నమ్మవద్దని, రిజర్వ్ బ్యాంక్ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా NBFCల ద్వారానే రుణాలు పొందాలని సూచించారు.
ప్రభుత్వ ముద్రా లోన్ పథకాలు వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ ప్రకటనల ద్వారా ప్రచారం చేయవని తెలిపారు. అపరిచిత యాప్‌లు డౌన్‌లోడ్ చేయకూడదని, తెలియని వ్యక్తులకు యూపీఐ లేదా బ్యాంక్ బదిలీల ద్వారా డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.






