ఒలంపిక్స్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ లేనట్లే!
posted on Nov 8, 2025 3:59PM

అంతర్జాతీయ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే, 2028 ఒలింపిక్స్‌లో మాత్రం దాయాదుల పోరు జరిగే అవకాశాలు కన్పించట్లేదు. ఐసీసీ రూపొందించిన కొత్త రూల్స్‌తో భారత్-పాక్ మ్యాచ్‌జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌ను కూడా చేర్చిన సంగతి తెలిసిందే.
2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని నిబంధనలు రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ లెక్కన ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా రీజినల్స్‌లో టాప్‌లో ఉన్న జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ప్రవేశం లభిస్తుంది.
ఇక ఆతిథ్య దేశానికి చోటు దక్కనుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ రౌండ్ ఏర్పాటుచేసి నిర్ణయిస్తారు. ఐసీసీ ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి ఇంగ్లాండ్ జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. ఈ రెండింటిలో ఒక జట్టును ఎంపిక చేయనున్నారు.
ఇక, ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసీసీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్ నిర్వహించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్‌కు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
అదే జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చంటున్నారు.128 ఏళ్ల తర్వాత 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఈసారి క్రికెట్‌కు చోటు దక్కింది. టీ20 ఫార్మాట్‌లో పురుషులు, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఒలింపిక్స్‌లో తొలిసారి, చివరిసారిగా 1900 సంవత్సరంలో క్రికెట్ నిర్వహించారు. అప్పుడు డెవాన్ అండ్ సోమర్‌సెట్ వండరర్స్ క్లబ్ (బ్రిటన్), ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ (ఫ్రాన్స్) మధ్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో బ్రిటన్ విజేతగా నిలిచింది.