పాకిస్తాన్.. చమురు సంక్షోభం.. భారత్.. ఇంధన భద్రతా వ్యూహం

posted on: Apr 30, 2026 3:57PM

పాకిస్తాన్ లో చమురు సంక్షోభం పరాకాష్ఠకు చేరింది.. ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశం వారానికి చెల్లించే చమురు దిగుమతి బిల్లు 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ  ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్ వెల్లడించారు. ఈ పెరుగుదల దాదాపు 167 శాతం.  వారానికి ముందు 300 మిలియన్ డాలర్ల చమురు బిల్లు… ఇప్పుడు 800 మిలియన్ డాలర్లు.. దీంతో రెండు సంవత్సరాల కష్టాన్ని ఒక్క యుద్ధం చెరిపేసింది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదొక్కటి చాలు... పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ బాహ్య ఇంధన షాక్ లకు ఎంత సున్నితంగా ఉందో, ఎంత బలహీనంలో ఉందో చెప్పడానికి. ఆ దేశంలో విదేశీ మారక నిల్వలు చాలా చాలా పరిమితంగా ఉన్నాయి. అలా ఉన్న దేశానికి ఇలాంటి అదనపు భారాలు  కరెన్సీ విలువ, ద్రవ్యోల్బణం, వృద్ధి రేటుపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి.  

కాగా తమ దేశంలో ఇంధన కొరతపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. పాక్ ప్రధాని భారత్ ను చూసి కుళ్లుకుంటున్నారు. ఇక ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్అయితే భారత్ నిల్వలు సమృద్ధిగా ఉండటంపై కినుక ప్రదర్శిస్తున్నారు. తమ దేశం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు లేవనీ కేవలం వారం రోజులకు సరిపడా కమర్షియల్ క్రూడ్ ఆయిల్ రిజర్వులే ఉన్నాయనీ అంగీకరిస్తూనే..  భారత్  కు ఒకే ఒక్క సంతకంతో చమురు సరఫరా భద్రత కల్పించే స్థాయి ఉందనీ బాధపడుతున్నారు.  మాట్లాడిన ఆయన.. మా వద్ద ఒక్క రోజు కూడా స్ట్రాటజిక్ రిజర్వ్ లేదు… అదే భారత్ కు అయితే..   60, 70 రోజుల భద్రత ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఒక్క వ్యాఖ్య చాలు..  ఇంధన భద్రతా వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు ఎంత త్వరగా సంక్షోభంలోకి జారిపోతాయో.. అందుకు భిన్నంగా భారత్ లా  దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వచ్చిన దేశాలు ఎలా స్థిరత్వాన్ని సాధిస్తాయో చెప్పడానికి. 

  పాకిస్తాన్ రోజువారీ చమురు వినియోగం సుమారు 4.2 నుంచి 4.4 లక్షల బారెళ్లు ఉంటే.. దానిలో  దేశీయ ఉత్పత్తి దాదాపు ఐదో వంతు మాత్రమే. మిగతా 80 శాతం అవసరాలు దిగుమతుల ద్వారానే నెరవేరుతున్నాయి.  దీంతో బ్రెంట్ ధరలు 110 నుంచి 115 డాలర్ల బారెల్ స్థాయికి చేరడంతో, పాకిస్థాన్ కు వారానికి 800 మిలియన్ డాలర్ల బిల్లు అంటే నెలకు 3.2 బిలియన్, సంవత్సరం పొడవున కొనసాగితే 40 బిలియన్ డాలర్లకు పైగా భారమయ్యే పరిస్థితి ఏర్పడింది.  

పాకిస్తాన్ వద్ద ప్రభుత్వ స్థాయిలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ వ్యవస్థ లేదు. కేవలం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల కమర్షియల్ నిల్వలు 20–21 రోజుల వరకు మాత్రమే సరిపోతాయని నివేదికలు చెబుతున్నాయి.  90 రోజుల స్ట్రాటజిక్ రిజర్వ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, భారీ ఆర్థిక వ్యయం, అప్పుల భారం కారణంగా ఆ ప్రణాళికలు ఫైళ్లలోనే నిలిచిపోయాయి.  ఇంధన భద్రతా ఫ్రేమ్వర్క్ లేకపోతే, ప్రతి జియోపాలిటికల్ సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థను బందీగా మార్చుతుంది. ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి అదే. దేశీయంగా విదేశీ మారక నిల్వలు అట్టడుగుకు చేరుకున్న తరుణంలో, పెరిగిన చమురు ధరలు ఆ దేశాన్ని దివాలా దిశగా పరుగులు పెట్టిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ అనుసరిస్తున్న ఇంధన భద్రతా వ్యూహాలను చూసి పాక్ పాలకులు అసూయతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

భారత్ 2000  దశకంలో నుంచే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. విశాఖపట్నం, మంగళూరు, పుదుచ్చేరి సమీపంలోని పడూర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ గుహల్లో మిలియన్ల టన్నుల క్రూడ్ నిల్వలు ఏర్పాటు చేసింది.  ప్రభుత్వ, రిఫైనరీ, కమర్షియల్ నిల్వలను కలిపి భారత్ కు 60 నుంచి 70 రోజుల వరకు చమురు అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.   

ఇక  రెండో దశలో అదనపు నిల్వ సామర్థ్యం పెంచేందుకు భారత్ ఇప్పటికే ప్రాజెక్టులు ప్రారంభించింది. దీని ద్వారా భవిష్యత్తులో 90 రోజుల వరకు కవరేజ్ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. భారత్ తన ఇంధన భద్రతను కేవలం నిల్వలపైనే కాకుండా..  సరఫరా మూలాల విభిన్నీకరణ, దీర్ఘకాలిక ఒప్పందాలు, రష్యా, మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాలతో బహుళ మార్గాల సరఫరా వ్యవస్థల ద్వారా బలోపేతం చేసింది.  ఇంధన భద్రత ఇప్పుడు జాతీయ భద్రతలో కీలక స్తంభం   భారత్ దీన్ని పాలసీ స్థాయిలో అంగీకరించింది.  
ఇక్కడే  భారత్, పాకిస్థాన్ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 

పాకిస్తాన్ మోడల్   ప్రతిస్పందనాత్మక విధానం అవలంబిస్తోంది. తాత్కాలిక కమర్షియల్ నిల్వలపై ఆధారపడటం,  విదేశీ మారక నిల్వలు అతి తక్కువగా ఉండటం ప్రతి గ్లోబల్ షాక్ కు ఐఎంఎఫ్, మిత్ర దేశాల సహాయంపై ఆధారపడే  విధానాన్ని పాక్ అవలంబిస్తుంటే.. ఇండియా మాత్రం..     స్ట్రాటజిక్ రిజర్వ్ నిర్మాణం, విభిన్న సరఫరా మూలాలు, అంతర్జాతీయ ధరల భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా..  కొంతవరకు నియంత్రించగలిగిన, భరించగలిగిన సామర్థ్యం. 

ఇప్పుడు పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరి..  రవాణా, విద్యుత్, ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.   భారత్ లో  కూడా ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ, నిల్వలు, పన్ను సర్దుబాట్లు, సబ్సిడీ   ద్వారా ప్రభావాన్ని   నియంత్రించే ప్రయత్నం కనిపిస్తోంది.  ఇంధన ధరల భారాన్ని  ముందస్తు ప్రణాళిక లేని దేశాల్లో సామాన్యుడే భరించాల్సి వస్తోంది. పాకిస్థాన్ లో ఇప్పుడు అదే జరుగుతోంది.  

ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి మీద నౌకాయాన అంతరాయం ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయనడంలో సందేహం లేదు.  ఇలాంటి సమయంలో స్ట్రాటజిక్ రిజర్వ్, విభిన్న సరఫరా మార్గాలు, దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్న దేశాలు తక్కువ నష్టంతో బయటపడతాయి.
అవేమీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ, ప్రజాజీవనం ఎలా కుదేలౌతాయనడానికి పాకిస్తాన్ ఉదాహరణ.  ఇంధన భద్రతను కేవలం ఆర్థిక అంశంగా కాకుండా, జాతీయ భద్రత, విదేశాంగ, ఆర్థిక విధానాల సమన్వయంతో చూడాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి బలంగా నొక్కి చెబుతోంది.   ఇంధన భద్రత లేకుండా ఆర్థిక స్వావలంబన అసాధ్యం. ఆర్థిక స్వావలంబన లేకుండా రాజకీయ స్వాతంత్ర్యం నిలకడగా ఉండదు గాక ఉండదు.  
 
పాకిస్తాన్ కు ఈ సంక్షోభం ఒక గట్టి హెచ్చరిక.  స్ట్రాటజిక్ రిజర్వ్, ఇంధన విభిన్నీకరణ, దీర్ఘకాలిక ప్రణాళికల లేమి ఎంత ప్రమాదకరమో ఈ వారానికి 800 మిలియన్ డాలర్ల బిల్లు స్పష్టంగా చెబుతోంది. భారత్ కు ఇది తన దిశ సరిగా ఉందనే ధృవీకరణతో పాటు, ఇంకా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్న ది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్యాస్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాల వైపు వేగంగా అడుగులు వేయడం కూడా ఇంధన భద్రతలో కీలక భాగం కానుంది. 

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://teluguone.com ఫాలో అవ్వండి.. మీ స్నేహితులతో  షేర్ చేయండి..  మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...