వైసీపీ హయాంలో నా ఫ్యామిలీపై కేసులు పెట్టారు : జస్టిస్ ఎన్వీ రమణ
posted on Nov 1, 2025 5:34PM

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని ఆయన వెల్లడించారు. వారిపై క్రిమినల్ కేసులు బనాయించారని వ్యాఖ్యానించారు .
అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, తనపై మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.రాజధాని అమరావతి రైతుల కష్టం, త్యాగాల పునాదులపై నిర్మితమవుతోందని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత రాజధాని కోసం ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులదేనని ప్రశంసించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం జరిగిన వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.