న్యూక్లియర్ ఎనర్జీ గ్లోబల్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం : మంత్రి లోకేష్

posted on: May 18, 2026 7:04PM

 

భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన “యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా” సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంధన పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి.

స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలు ప్రపంచ ఇంధన రంగాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. భారత్‌లో ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోటీ ఖర్చులు, ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ సదుపాయాలు కలిసి న్యూక్లియర్ పరిశ్రమకు భారీ అవకాశాలను తీసుకొస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీరప్రాంతం, శక్తివంతమైన పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి వివరించారు. 

పారిశ్రామికీకరణలో వేగం, అమలు సామర్థ్యం అత్యంత ముఖ్యమని, న్యూక్లియర్ ఎకోసిస్టమ్‌లో భాగస్వామ్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాంకేతిక సహకారాలు, తయారీ భాగస్వామ్యాలు, సప్లై చైన్ అభివృద్ధి, రీసెర్చ్, స్కిల్లింగ్, వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో గ్లోబల్ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధమని వెల్లడించారు. ఇంధన భద్రత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన అంశంగా మారిందని లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, క్లైమేట్ కమిట్‌మెంట్లు, డికార్బనైజేషన్ లక్ష్యాలు దేశాల ముందున్న పెద్ద సవాళ్లని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక ఇంధన ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు.

రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, భారీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. విశాఖపట్నాన్ని ఏఐ మరియు డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, అక్కడ 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయని వెల్లడించారు. భవిష్యత్ పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన, కాలుష్య రహిత విద్యుత్ అవసరమవుతుందని, అందుకే ఇంధన ప్రణాళిక ఆర్థికాభివృద్ధిలో కీలకమైందన్నారు.

ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రెన్యూవబుల్స్, స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రా, తయారీ రంగాల్లో సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ వెల్లడించారు. భవిష్యత్ పారిశ్రామిక వృద్ధికి పునరుత్పాదక శక్తి ఒక్కటే సరిపోదని, న్యూక్లియర్ ఎనర్జీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. డేటా సెంటర్ల చుట్టూ పూర్తి స్థాయి తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కూలింగ్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, బ్యాటరీ స్టోరేజ్, సెమీకండక్టర్ అనుబంధ పరిశ్రమలను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నీషియన్లు, ఎనర్జీ ఇంజనీర్ల కోసం ప్రత్యేక స్కిల్లింగ్ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. న్యూక్లియర్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాదని, అది పూర్తి స్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా మారబోతోందని లోకేష్ అభిప్రాయపడ్డారు. విడిభాగాల తయారీ, ప్రత్యేక ఉక్కు పరిశ్రమలు, ఇంజనీరింగ్ సామర్థ్యాలు, ప్రపంచస్థాయి భద్రతా ప్రమాణాలు, న్యూక్లియర్ వర్క్‌ఫోర్స్ శిక్షణ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏఐ భవిష్యత్తు ఇంధన భవిష్యత్తుపైనే ఆధారపడి ఉందని పేర్కొన్న లోకేష్, ప్రపంచ టెక్ దిగ్గజాలు కూడా ఇప్పుడు దీర్ఘకాలిక న్యూక్లియర్ భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తున్నాయని అన్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యంలో తదుపరి కీలక అధ్యాయం న్యూక్లియర్ ఎనర్జీ రంగమే అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...