Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్ వ్యక్తిత్వ ఔన్నత్యం శిఖరాయమానం
posted on: May 8, 2026 10:23AM

తెలుగు ప్రజల గుండెల్లో అన్నగా సుస్థిర స్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావు జీవితం ఒక తెరిచిన పుస్తకం. వెండితెరపై దైవ స్వరూపంగా కనిపించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆయన సిద్ధాంతాలు, విలువలు కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆచరణలోనూ కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతికి, సేవకు మారుపేరుగా నిలిచిన మదర్ థెరీసా స్వయంగా ఒక ప్రతిపాదనను ఆయన ముందుంచినప్పుడు, ఎన్టీఆర్ ఎంతో గౌరవంగా దానిని తిరస్కరించడం ఆనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ఎన్టీఆర్ వ్యక్తిత్వంలోని ధైర్యాన్ని, ధర్మనిష్ఠను చాటిచెబుతుంది.
1980వ దశకం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్.. జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఒక సందర్భంలో మదర్ థెరీసాతో ఆయనకు భేటీ జరిగింది. అప్పటికే కోల్ కతా కేంద్రంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా మదర్ థెరీసా చేస్తున్న సేవలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆమె తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసే క్రమంలో.. ప్రజాకర్షణ కలిగిన ఎన్టీఆర్ వంటి నాయకుడి సహకారాన్ని కోరారు. తన మిషన్ ప్రచార బాధ్యతల్లో లేదా సేవా విభాగాల్లో భాగస్వామి కావాలని ఆమె కోరారు.
ఈ ప్రతిపాదనకు ఎన్టీఆర్ ఏమాత్రం తడబడకుండా, అత్యంత మర్యాదపూర్వకమైన రీతిలో నో చెప్పారు. తాను భారత పౌరుడిననీ, తనకంటూ ఒక ధర్మం, జీవన విధానం ఉన్నాయనీ చెప్పిన ఆయన.. మదర్ థెరిస్సా సేవ పట్ల ఎనలేని గౌరవం ఉందని చెబుతూనే.. ఆ మిషన్ ప్రచారాల్లో భాగస్వామిని కాలేనంటూ సున్నితంగానే అయినా నిష్కర్షగా చెప్పారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అంతర్జాతీయ స్థాయి వ్యక్తి విజ్ణప్తిని కాదనడం సామాన్యమైన విషయం కాదు. అయితే, తన హిందూ సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూనే.. ఇతర మతాల పట్ల విద్వేషం లేకుండా తన పంథాను ఆయన చాటుకున్నారు. ఇది ఆయనలోని ఎన్టీఆర్ లోని స్వాభిమాన లౌకికవాదానికి నిలువెత్తు నిదర్శనం.
ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి పాత్రల ద్వారా కోట్లాది మందిలో భక్తి భావాన్ని నింపారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన లౌకికవాదాన్ని పాటించారు. అయినా.. సొంత ధర్మాన్ని ఎక్కడా వదులుకోలేదు. మదర్ థెరీసా ప్రతిపాదనను తిరస్కరించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం మత ప్రచారానికి, రాజకీయాలకు మధ్య ఒక స్పష్టమైన గీత గీయడమే. ప్రజా ప్రతినిధిగా అన్ని మతాల వారినీ సమానంగా చూడాలి తప్ప, ఒక నిర్దిష్ట మత సంస్థ ప్రచారకర్తగా మారడం సరికాదని ఆయన భావించారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలకు, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలకు మధ్య అద్భుతమైన సమతుల్యతను పాటించారు.
నేటి రాజకీయాల్లో చాలామంది నాయకులు ఓట్ల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మతపరమైన వేదికలను వాడుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఎన్టీఆర్ ఆనాడే విలువల కోసం నిలబడ్డారు. ఒక వ్యక్తిగా మదర్ థెరీసాను గౌరవిస్తూనే.. సిద్ధాంతపరంగా విభేదించడం అనేది ఒక గొప్ప నాయకత్వ లక్షణం. ఈ సంఘటన కేవలం ఒక తిరస్కరణ మాత్రమే కాదు, తన సంస్కృతిని ప్రేమిస్తూనే ఇతరులను గౌరవించే ఒక సంస్కారవంతమైన దృక్పథం. అందుకే దటీజ్ ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు నాడూ, నేడూ, ఎప్పుడూ కూడా గర్వంగా చెప్పుకుంటారు.
ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి ఒక పాఠం. అస్తిత్వాన్ని కోల్పోకుండా, పరుల పట్ల మర్యాదగా ఉంటూనే బాధ్యతలను ఎలా నిర్వహించాలో, ఎలా నిర్వర్తించాలో ఎన్టీఆర్ ఆచరించి చూపారు. చరిత్రలో కొన్ని ఘట్టాలకు లిఖితపూర్వక ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అప్పటి రాజకీయ నాయకులు, ప్రత్యక్ష సాక్షుల మౌఖిక వర్ణనలు ఈ ఆసక్తికర విషయాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచాయి. నందమూరి తారకరామారావు జీవితంలోని ఇటువంటి అరుదైన కోణాలు ఆయనను సామాన్య నాయకుడి నుండి ఒక యుగపురుషుడిగా, శకపురుషుడిగా మార్చాయి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. , మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.



.webp)


