ఎన్టీఆర్ సినిమాలో ' ఆ రెండు పాత్రల' గురించే జనం డిస్కషనంతా!

ఎన్టీఆర్... ఈ పేరు తెలుగు వారికి ఒక పదం కాదు! పరమార్థం! ఎన్టీఆర్ అంటే కొందరికి హీరో, మరి కొందరికి రాజకీయ నేత, ఇంకా కొందరికైతే అవతార పురుషుడు! అలాంటి విశిష్ట వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ఇంకేముంది? అదీ ఎన్టీఆర్ తనయుడు, శత చిత్ర కథానాయకుడు, బాలకృష్ణ నటిస్తారంటే ఇంక అభిమానుల ఆనందానికి హధ్దు వుంటుందా? ఇప్పుడు అదే జరుగుతోంది! నందమూరి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా! ఒక నందమూరి అందగాడు మరో నందమూరి చారిత్రక జీవితం గురించి సినిమా చేయటం... నిజంగా అద్బుతమే!

 


ఎన్టీఆర్ గురించి సినిమా అంటే అందరూ ఆనందపడిపోతారు. కాకపోతే, అదే సమయంలో కొన్ని ప్రశ్నలు మాత్రం ఇప్పట్నుంచే రాజకీయ, సినిమా జీవుల్ని వేధిస్తూ వుంటాయి! ఎందుకంటే, నిమ్మకూరులో మొదలైన ఎన్టీఆర్ మహా ప్రయాణం చెన్నై మీదుగా హైద్రాబాద్ కి వచ్చింది. ఆయన సినీ రంగాన్ని ఏలినంత కాలం ఏ వివాదమూ లేదనే చెప్పాలి. ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచీ ప్రతీ తెలుగు కుటుంబంలోనూ తానొక సభ్యుడిగా ఎదిగారు. ఇదంతా సినిమాగా చూపటం కష్టమైనా సాధ్యమనే చెప్పాలి! కాని, అసలు సమస్యంతా నటరత్న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతోనే! ఆ తరువాత పరిణామాల్ని సినిమా తీయబోయే డైరెక్టర్ ఎలా చూపనున్నాడని జనం మాట్లాడుకుంటున్నారు! 

 

 


టీడీపీ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ఇందిరా గాంధీకి, కాంగ్రెస్ కు ఎదురు నిలిచారు. కాని, తరువాతి కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదటి సారి సీఎం అవ్వగానే ఓ సారి పదవి గండం ఎదుర్కొన్నారు. ఈ ఘట్టంలో ఎవర్ని దోషులుగా చూపబోతున్నారనేది ఇంట్రస్టింగ్ అంశం! ఎందుకంటే, ఖచ్చితంగా ఆనాటి ప్రముఖ కాంగ్రెస్ నేతల్నే ఈ ఎపిసోడ్ లో విలన్స్ గా చేయాల్సి వుంటుంది. ఇక టీడీపీ చీలిక సమయంలో ప్రస్తుత ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుది కీలక పాత్ర. ఆయన క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా చూపిస్తారన్నదీ ఆసక్తికర అంశమే! 

 

 


ఎన్టీఆర్ గా నటిస్తానని చెబుతోన్న బాలకృష్ణకు చంద్రబాబు స్వయానా బావ. అలాగే, ఇప్పుడు ఆయన కొడుకు లోకేష్ బాలయ్యకు అల్లుడు కూడా! మరి సినిమాలో ఎన్టీఆర్ చంద్రబాబుల మధ్య సంఘర్షణని ఎలా చూపిస్తారు? ఇప్పుడు అందర్నీ తొలిచేస్తోన్న అతి పెద్ద ప్రశ్న ఇదే! అలాగే, బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు ఎవ్వరూ పెద్దగా సత్సంబంధాలు పెట్టుకోని ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి. మహానటుడి జీవితపు చివరి అంకంలో ఆమె ప్రవేశించింది. ఆమె పాత్ర లేకుండా కూడా ఎన్టీఆర్ బయోపిక్ అసాధ్యమే. మరి ఆ పాత్రని దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి! 
ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వున్నప్పటికీ బాలకృష్ణ తండ్రి జీవితం పై సినిమా చేస్తాననటం మెచ్చుకోదగిందే. గౌతమీ పుత్ర లాంటి సాహసవంతమైన చిత్రం చేసిన ఆయన మరోసారి అదే బాటలో సాహసం ప్రదర్శించటం అద్భుతం. కాకపోతే, ప్రస్తుతానికి ఈ ల్యాండ్ మార్క్ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి... ఆయన ఈ కత్తి మీద సాము ఎలా చేస్తారో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu