రెంటికీ చెడ్డ రేవడి కానున్న జూనియర్ ఎన్టీఆర్!
posted on Apr 21, 2014 4:42PM
.jpg)
నాన్నచాటు బిడ్డలాగా, నాన్న చెప్పినట్టే వింటున్న జూనియర్ ఎన్టీఆర్ రాబోయే కాలంలో ఇటు రాజకీయ రంగానికి, అటు సినిమా రంగానికి దూరమై రెంటికీ చెడ్డ రేవడి అవడం ఖాయమన్న అభిప్రాయాలు అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికలలో ఎవరూ పిలవకుండానే వచ్చి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి చప్పుడు చేయడం లేదు. తన తండ్రి నందమూరి హరికృష్ణకి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా వున్నాడనేది బహిరంగ రహస్యం. అయితే ఎన్టీఆర్ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా వుండటమే. ఆయన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కూడా వుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలన్నా తెలుగుదేశం పార్టీతోనే ఆయనకు భవిష్యత్తు వుంటుంది. తెలుగుదేశం అభిమానులు చూడటం, ప్రమోట్ చేయడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ విజయాలు అందుకుంటున్నారన్న అభిప్రాయం జనాల్లో వుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమైన తర్వాత ఆయనకు సినిమా రంగంలో అన్ని ఫ్లాపులే వస్తూ వుండటాన్ని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అటు సినిమా అయినా, ఇటు రాజకీయమైనా తనకు భవిష్యత్తు టీడీపీతోనే వుందని తెలిసినా కావాలని దూరమవుతూ వుండటం అతనికే మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రచారానికి రావడానికి ఎవరూ బొట్టుపెట్టి పిలవరు, ఎవరికి వారే రావాలని చంద్రబాబు దగ్గర్నుంచి, లోకేష్ వరకూ అందరూ చెబుతూనే వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆరే పంతం తగ్గించుకున్ని తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి ముందుకు వస్తే అందరికీ బాగుంటుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే జూనియర్ తెలుగుదేశానికి ప్రచారానికి రాకపోగా వైకాపాలోకి వెళ్ళిన కొడాలి నానికి మద్దతు ఇస్తూ వుండటం, తనకు సంబంధించిన ఛానల్‌లో వైకాపాకు మద్దతు ఇస్తూ వుండటం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావాలంటే ఆయన తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి ముందుకు రావాలని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.