Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పొదుపు మంత్రం కాదు.. ఆర్థిక, జాతీయ భద్రతా వ్యూహం
posted on: May 12, 2026 6:39AM
.webp)
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక అత్యవసర పిలుపునిచ్చారు. మొదటి చూపులో ఇవి సాధారణ పొదుపు సూత్రాలుగా కనిపించినప్పటికీ, వీటి వెనుక లోతైన ఆర్థిక, జాతీయ భద్రతా వ్యూహాలు దాగి ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే గడ్డు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే విషయంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ... మోదీ ప్రతిపాదించిన 7 సూత్రాలలో ప్రధానంగా ఇంధన పొదుపుపై దృష్టి సారించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అనవసర వినియోగాన్ని తగ్గించాలనీ, అత్యవసరమైతే తప్ప వాహనాలను వాడొద్దని సూచించారు. అలాగే.. విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గించేందుకు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు, లగ్జరీ వివాహాలను వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో విజయవంతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్ళీ ప్రోత్సహించాలనీ, ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకోవాలని మోడీ కోరారు. దీంతో పాటు వంటనూనెలు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి.. స్వదేశీ, సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు.
ఈ వ్యూహాత్మక పిలుపు వెనుక హోర్ముజ్ జలసంధి సంక్షోభం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచ ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. భారత్ తన చమురు అవసరాల కోసం దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో చమురు సరఫరాలో అంతరాయం కలిగితే ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, రూపాయి విలువ పతమై ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కేంద్రం.. ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తోంది. ఆర్థిక కోణంలో చూస్తే, భారత్ ఏటా సుమారు 70 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం బంగారం దిగుమతులకే ఖర్చు చేస్తోంది. ప్రజలు బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తే.. దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్లిష్ట సమయంలో రక్షణ కవచంలా మారుతాయి. విదేశీ పర్యటనల ద్వారా బయటకు వెళ్లే కరెన్సీని ఆదా చేయడం ద్వారా దేశంపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని మోడీ అంటున్నారు.
యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే.. పెరిగే అంతర్జాతీయ ధరల భారాన్ని ప్రభుత్వం ఒక్కటే మోయడం అసాధ్యమనీ.. అందుకే ప్రజల సహకారం అనివార్యమని ప్రధాని చెప్పారు. జాతీయ భద్రత దృష్ట్యా కూడా ఈ పిలుపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం తీవ్రతరం అయితే, సముద్ర మార్గాల భద్రత, ఇంధన భద్రత కోసం భారత నౌకాదళం, వాయుసేన అప్రమత్తం కావాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో దేశీయంగా ఇంధన డిమాండ్ తక్కువగా ఉంటే.. వ్యూహాత్మక అవసరాలకు అది వెసులుబాటును ఇస్తుంది.
ప్రజల రోజువారీ అలవాట్లు కూడా ఇప్పుడు జాతీయ రక్షణ వ్యూహంలో భాగంగా మారాయనేది ప్రధాన సందేశం. రాజకీయంగా చూస్తే, ఇది ఒక రకమైన ఎక్స్ పెక్టేషన్ మేనేజ్ మెంట్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధ ప్రభావం వల్ల ధరలు పెరిగితే.. అది ప్రభుత్వ వైఫల్యం కాదని, ప్రపంచ పరిస్థితుల వల్ల సంభవించిన పరిణామమని ప్రజలకు ముందుగానే తెలియజేయడం దీని ఉద్దేశ్యం. మేము ముందే హెచ్చరించాం.. ఇది సమష్టిగా ఎదుర్కోవాల్సిన యుద్ధం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయ విమర్శలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాలు చేసే పొదుపు ప్రచారాలకు, ఈ పిలుపునకు చాలా వ్యత్యాసం ఉంది. ఇందులో ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ అంశాలను నేరుగా ప్రస్తావించడం, ఒక ఏడాది కాలపరిమితిని విధించడం దీని తీవ్రతను చాటి చెబుతోంది. కోవిడ్ సమయంలో దేశం చూపిన ఐకమత్యాన్ని, త్యాగ నిరతిని మోదీ గుర్తు చేస్తూ.. మరోసారి అటువంటి సమష్టితత్వం అవసరమని పేర్కొన్నారు. మోదీ ఇచ్చిన ఈ 7 సూత్రాల పిలుపు దేశభక్తిని కేవలం భావోద్వేగంగా కాకుండా ఆర్థిక శక్తిగా మార్చాలని కోరుతోంది. వ్యక్తిగత వినియోగాన్ని నియంత్రించుకోవడం ద్వారా దేశ భద్రతను కాపాడవచ్చనే సందేశాన్ని మోడీ బలంగా వినిపించారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు కానీ.. ముందస్తుగా సిద్ధం కావడం ద్వారా అతిపెద్ద ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడుకోవచ్చనేదే ఈ పిలుపు సారాంశం.
- సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి






