Latest News
లవ్ జిహాద్ కాదు.. ప్రేమబంధమే కలిపింది.. కుంభమేళా మోనాలిసా స్పష్టీకరణ
posted on: Mar 15, 2026 9:23AM

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర ప్రయాగ్ రాజ్ మహాకుంభమేలా.. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులు తారు. కానీ గత ఏడాది కుంభమేళాలో వీరెవరూ కాదు కానీ ఓ 16 ఏళ్ల అమ్మాయి.. అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలిక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది. కుంభమేళాకు వచ్చిన జనం. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీలు పడ్డారు. చిన్నా పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేదు.. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మాట్లాడి వీలైతే ఫొటో తీసుకోవాలని ఆరాటపడ్డారు. ఇంతకీ ఆమె ప్రత్యేకత ఏమిటి? అంటే . అతి సాధారణమైన ఆ అమ్మాయి సహజత్వం, కల్మషమెరుగని మందహాసం, మరీ ముఖ్యంగా తెనెకళ్లు.. అన్నిటికీ మించి అమాయకత్వం వెరసి ఆమె గరల్ ఆఫ్ ది సాయిల్. ఆ అమ్మాయిలోని ఈ సింప్లిసిటీ, ఈ సహజత్వమే అందరినీ ఆకర్షించింది. ఇంకే ముంది నెటిజనులు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరు పెట్టేశారు. ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముతూ, తన నీలి కళ్ళతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోస్లే పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకున్న ఈ యువతి, ప్రస్తుతం అనేక వివాదాల నడిబొడ్డున నిలిచింది. ఆమెకు సినీమా అవకాశాలిస్తామంటూ నిర్మాతలు, దర్శకులు ముందుకు వచ్చారు. ఆమెలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ పోలికలు ఉండటంతో భవిష్యత్ స్టార్ హీరోయిన్ అంటూ మీడియా కూడా ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేసింది. సరే కుంభమేళా అయిపోయిన ఇంత కాలానికి ఆ కుంభమేళా మోనాలిసా మళ్లీ వార్తల్లో నిలిచింది.

విషయమేంటంటే.. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి మతాలు వేరు కావడంతో మోనాలిసా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి నిరాకరించారు. ఆమెకు ఇష్టం లేకపోయినా వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసేందుకు ప్రయత్నించడంతో, మోనాలిసా తన ప్రియుడితో కలిసి కేరళకు వెళ్లిపోయింది. తిరువనంతపురంలోని పోలీసులను ఆశ్రయించింది. అనంతరం ఫర్మాన్ ఖాన్ తో ఆమె వివాహం ఒక హిందూ ఆలయంలో జరిగింది. ఆమె పెళ్లి వార్త వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఆమె తండ్రి జైసింగ్ భోస్లా తన కుమార్తె లవ్ జిహాద్ కు గురైందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించడం సంచలనం సృష్టించింది. తన కుమార్తెను మోసపూరితంగా ప్రేమ పేరుతో లవ్ జిహాద్ కు గురి చేశారని ఆరోపిస్తూ.. తన కుమార్తెను సురక్షితంగా తీసుకురావాలని ఆయన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ను కోరారు. అంతే కాకుండా.. మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా పక్కా ప్రణాళికతో జరిగిన 'లవ్ జిహాద్' అని వ్యాఖ్యానించాడు.
అయితే ఈ విమర్శలు, ఆరోపణలను మోనాలిసా దంపతులు తీవ్రంగా ఖండించారు. మీడియా ముందుకు వచ్చిన ఈ జంట తాము మతం మారలేదని స్పష్టం చేసింది. తాను ఇస్లాంలోకి మారలేదనీ, హిందూ సాంప్రదాయం ప్రకారమే ఆలయంలో పెళ్లి చేసుకున్నాం మోనాలిసా స్పష్టం చేసింది. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేయాలని చూడటం వల్లే తాను ఇంటి నుండి బయటకు రావాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టింది. ఫర్మాన్ కూడా తమ మధ్య ఉన్నది ప్రేమ బంధమని స్పష్టం చేశాడు. తమ వివాహానికి మతం రంగు పులమద్దని వేడుకున్నాడు.






