ఉత్తర కొరియా చరిత్రలోనే అతిపెద్ద అణు యుద్ధనౌక లాంచ్.. కిమ్ సంచలనం

posted on: Jun 25, 2026 9:14AM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సారి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరి భయాందోళనలను రేకెత్తించారు. అంతర్జాతీయ ఆంక్షలను బేఖాతరుర చేస్తూ..  తమ నావికాదళ చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన అణు సామర్థ్య యుద్ధనౌకను  ఆవిష్కరించారు. 'చో హ్యోన్' అని పిలిచే ఈ 5,000 టన్నుల అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధనౌకను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్   నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అణ్వాయుధాలను అత్యంత సులువుగా మోసుకెళ్లే  సామర్థ్యం ఉన్న ఈ నౌకతో..  తమ నావికాదళాన్ని అణు శక్తిగా మార్చాలన్న కిమ్ జోంగ్ ఉన్   ఆకాంక్ష   నెరవేరినట్లయింది. కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న ఈ పరిణామం అంతర్జాతీయ రక్షణ రంగంలో  ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఉత్తర కొరియా పశ్చిమ తీరంలోని   నాంపో నౌకాశ్రయంలో  జరిగిన ఈ  కార్యక్రమంలో   కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ..   ఏడు దశాబ్దాలుగా ఉత్తర కొరియా నౌకాదళంలో నెలకొన్న స్తబ్దతకు  ముగింపు పలికామని   ప్రకటించారు. అత్యాధునిక విమాన విధ్వంసక వ్యవస్థలు, అత్యంత వేగంగా దూసుకెళ్లే యాంటీ-షిప్ క్షిపణులతో పాటు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్,  బాలిస్టిక్ క్షిపణులను కూడా ఈ 'చో హ్యోన్' యుద్ధనౌక నుండి  ఖచ్చితత్వంతో ప్రయోగించవచ్చు. ఈ  యుద్ధనౌక   దేశ పశ్చిమ తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించనుందని  ఉత్తర కొరియా రక్షణ వర్గాలు వెల్లడించాయి.

కాగా ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ అమెరికా,  దక్షిణ కొరియాలకు  స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారుర.  రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతి ఏటా రెండు చొప్పున 'చో హ్యోన్' తరహా భారీ డిస్ట్రాయర్‌ నౌకలను నిర్మిస్తామని ప్రకటించారు.  వీటితో పాటు భవిష్యత్తులో పదివేల  టన్నుల బరువుండే అత్యంత భారీ యుద్ధనౌకలను,   శత్రువుల రాడార్లకు   దొరకని కొన్ని అత్యంత శక్తిమంతమైన  జలాంతర్గత ఆయుధాలను" వేగంగా అభివృద్ధి చేయాలని రక్షణ రంగాన్ని ఆదేశించారు. అమెరికా,  దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా తమ సరిహద్దుల్లో చేపడుతున్న సైనిక విన్యాసాలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికే ఈ భారీ ఆయుధ సమీకరణ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కిమ్ చెప్పారు.   అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. ఈ అత్యాధునిక డిస్ట్రాయర్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తమ శాస్త్రవేత్తలు నిర్మించినట్లు ఉత్తర కొరియా గర్వంగా ప్రకటించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...