Latest News
కొరత లేదు.. ఆందోళన వద్దు.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
posted on: Mar 25, 2026 12:37PM

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పలు చోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. పెట్రోల్ దొరకదనే భయంతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకోవడం.. అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి మొగ్గు చూపడం వల్లే బంకుల్లో ఉన్న నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని వివరించింది. బంకుల్లో స్టాక్ అయిపోయిన తర్వాత, డిపోల నుంచి మళ్ళీ ట్యాంకర్లు వచ్చి నింపడానికి కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం సహజమేనని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నిన్న ఒక్కరోజే సుమారు 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు రాష్ట్రంలోని బంకులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం దాదాపు 20 వేల కిలోలీటర్ల ఇంధనం అందుబాటులో ఉందని, రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌లో పెట్రోల్ అమ్మకాలు జరిపే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలను కోరారు.
కాగా శామీర్‌పేట, తుంకుంట, హకీంపేట్ ప్రాంతాల్లోని కొన్ని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్లలో నిలబడ్డారు. కొన్ని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇక పోతే నగరంలోని అన్ని ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పెద్ద సంఖ్యలో వాహనదారులు బంకుల వద్దకు చేరడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ముఖ్య రహదారులపై ఉన్న బంకుల వద్ద పరిస్థితి మరింతగా తీవ్రంగా మారి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.






