నిఫా వైరస్.. లాక్ డౌన్ భయం లేదు!
posted on: Jan 30, 2026 3:01PM

దేశంలో నిఫా వైరస్ వ్యాప్తి వార్తలు బయటకు రాగానే ఒక్కసారిగా జనంలో మళ్లీ కరోనా కాలం నాటి పరిస్థితులు రానున్నాయా? అన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో తాజాగా నిఫావైరస్ కేసులు వెలుగులోకి రావడంతో లాక్ డౌన్ కు మరో సారి రెడీ కావాలా అన్న చర్చ దేశ వ్యాప్తంగా ఆరంభమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) క్లారిటీ ఇచ్చింది. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిఫా వైరస్ వ్యాప్తిపై ఆందోళన అనవసరమని డబ్ల్యుహెచ్ఓ పేర్కొంది.
ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి తీవ్రత పెద్దగా లేదనీ, ఈ వైరస్ రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు, అలాగే దేశాలకూ విస్తరించే అవకాశాలు లేవనీ క్లారిటీ ఇచ్చింది. ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఇసుమంతైనా లేదనీ, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ 24 పరగణాల జిల్లాలోని బారసత్ ప్రాంతంలో ఒకే ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన వైద్యులు వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. వారితో కాంటాక్ట్ ఉన్న వారెవరికీ నిఫా వైరస్ సోకలేదని నిర్ధారణ అయ్యింది. ఈ ఇద్దరితో సన్నిహితంగా ఉన్న 196 మందిని గుర్తించి, పరీక్షలు నిర్వహించగా, వారెవరిలోనూ నిఫా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారణ అయ్యింది.
నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. కలుషిత ఆహారం లేదా సన్నిహిత పరిచయం ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ నిఫా వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స లేదు, అయితే ముందుగా గుర్తించి, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ చర్యలతో దీని నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్నిటికీ మించి అప్రమత్తత, అవగాహన, సమన్వయం ఇవే నిఫావైరస్ నియంత్రణకు మార్గమని అంటున్నారు.



.webp)


