Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అణ్వాయుధాల విషయంలో తగ్గేది లేదు- పాకిస్తాన్
posted on: Mar 2, 2016 2:29PM

విచ్చలవిడిగా అణ్వాయుధాలను సేకరించుకునే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని పాకిస్తాన్ కుండబద్దలు కొట్టేసింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణ్వాయుధాలకు సంబంధించిన తన విధానాన్ని సమీక్షించుకోవాలని అమెరికా సూచించిన మర్నాడే, ఈ మాటలు వినిపించడం గమనార్హం. తాము కావాలని అణ్వాయుధాలను సమకూర్చుకోవడం లేదనీ, తన పొరుగుదేశమైన భారతదేశానికి దీటుగానే ఆయుధాలను పెంచుకోవలసి వస్తోందన్నది సర్తాజ్ ఉవాచ. భారత్, పాకిస్తాన్‌ల ఆయుధసంపత్తి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉన్నా అది తమ రక్షణ మీదే ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు సర్తాజ్. పనిలోపనిగా అమెరికా, భారత్‌లకు ఒక ఉచిత సలహాను కూడా అందించారు. ఒకవేళ భారతదేశం తన ఆయుధసంపత్తిని నియంత్రించుకుంటే, అమెరికా కూడా రక్షణ శాఖలో భారతదేశానికి సహాయం చేయకుండా ఉంటే... అప్పుడు తమ అణ్వాయుధ విధానం గురించి ఆలోచిస్తామని చెప్పారు.
ఇక ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య శాంతి చర్చల గురించి కూడా సర్తాజ్ తనదైన శైలిలో స్పందించారు. పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద జరిగిన దాడి విషయంలో పాకిస్తాన్ అద్భుతంగా స్పందించిందనీ... కాబట్టి, ఇరుదేశాల మధ్య చర్చలు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు లెక్కకు మిక్కలిగా పోగవుతున్నాయనీ, చైనా సాయంతోనే పాక్ ఈ ఆయుధాలను సమకూర్చుకుంటోందనీ, అవి కనుక తీవ్రవాదుల చేతిలో పడితే ఆసియా వినాశనం తప్పదని ప్రపంచదేశాలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాయి. సర్తాజ్ ఈ భయాల గురించి మాత్రం స్పందించలేదు.






