రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ ప్రమాణ స్వీకారం.. రెండు మూడు రోజుల్లో బీహార్ సీఎంగా రాజీనామా!

posted on: Apr 10, 2026 2:13PM

బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారం (ఏప్రిల్ 10)  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇకపై పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలకే పరిమితం కానున్నారు.  

రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్   ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు  వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రమాణ స్వీకారంతో నితీశ్ కుమార్ భారత రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. శాసనసభ , శాసనమండలి , లోక్‌సభ,  రాజ్యసభ లలోనూ  సభ్యుడిగా పనిచేసిన అతికొద్ది మంది నాయకుల జాబితాలో నితీశ్ చేరారు. ఇది ఆయన సుదీర్ఘ,  వైవిధ్యభరితమైన రాజకీయ అనుభవానికి అద్దంపడుతోంది.

గత నెలలో జరిగిన ఎన్నికల్లో నితీశ్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన గత నెల  30న తన శాసనమండలి సభ్యత్వానికి   రాజీనామా సమర్పించారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నందున, ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీహార్ అభివృద్ధి కోసం తాను ఇన్నేళ్లుగా పని చేశాననీ, రాష్ట్ర ప్రగతికి అవసరమైన పునాదులు వేశాననీ చెప్పుకొచ్చారు.  ఇక నుంచీ జాతీయ స్థాయిలో సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. 2005 నుండి బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా కొనసాగుతూ వచ్చిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...