Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన పక్కింటి మహిళ
posted on: Jun 26, 2026 9:35PM
.webp)
వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి నిత్విక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పక్కింట్లో నివసించే స్వాతి అనే మహిళే చిన్నారిని హత్య చేసినట్లు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు.
గ్రామానికి చెందిన సృజన శ్రీ–రామాచారి దంపతుల కుమార్తె నిత్విక (4) గురువారం ఇంటి వద్ద నీటి డ్రమ్ములో మృతిచెంది కనిపించింది. చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహకారంతో దర్యాప్తు జరిపి పక్కింటి మహిళ స్వాతిని నిందితురాలిగా గుర్తించారు.
న్యాయం కోసం గ్రామస్థుల ఆందోళన
చిన్నారిని హత్య చేసి నీటి డ్రమ్ములో పడేశారని ఆరోపిస్తూ గురువారం రాత్రి పులివెందుల–పార్నపల్లె రింగ్ రోడ్డుపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ మురళి నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనలు
శుక్రవారం పులివెందుల రూరల్ పోలీస్ స్టేషన్, పూలంగల సర్కిల్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. కుటుంబాల మధ్య ఉన్న విభేదాలకు అమాయక చిన్నారిని బలి చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
డీఎస్పీ వివరాలు
పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళి నాయక్ మాట్లాడుతూ.. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లింగాల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఎస్పీ సచేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో స్వాతిపై అనుమానం బలపడటంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కేసు వెలుగులోకి వచ్చిందన్నారు.
ఇరువురు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని, గతంలో వాహనాల దహనం వంటి ఘటనలు కూడా జరిగాయని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా బైండోవర్ చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.
నిందితురాలి వెనుక ఎవరున్నా చట్టపరంగా చర్యలు తప్పవని, కేసులో మరిన్ని ఆధారాలు సేకరించి బలమైన చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు.
పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలింపు
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. నీటి నమూనాలతో పాటు ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.


.webp)
.webp)


