విజయనగరం ఐసిస్ ఉగ్రకుట్ర కేసు.. ఎన్ఐఏ అనుబంధ చార్జిషీట్
posted on: Feb 21, 2026 9:07AM
.webp)
విజయనగరం జిల్లాలో వెలుగుచూసిన ఐసిస్ ఉగ్ర కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడితో పాటు మరో వ్యక్తిపై ఎన్‌ఐఏ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జ్ షీట్ లో కీలక ఆధారాలను కోర్టుకు నివేదించింది. విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ శుక్రవారం (ఫిబ్రవరి 20) ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
ఈ కేసులో అబు తాలిబ్ అలియాస్ ఆరిఫ్ హుస్సేన్, ఇమ్రాన్ అక్రమ్‌లపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం , ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. వీరిలో ఇమ్రాన్ అక్రమ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆరిఫ్ హుస్సేన్‌ను గత ఏడాది ఆగస్టు 27న న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు మొదట విజయనగరం పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. సిరాజ్ ఉర్ రహిమాన్, సయ్యద్ సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దర్యాప్తుచేపట్టింది. గత ఏడాది నవంబర్ 2025లో ఈ ఇద్దరిపై మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది.
కాగా తాజాగా ఎన్ఐఏ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో కీలక, సంచలన విషయాలు బయటపడ్డాయి. పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. పేలుడు పదార్థాల సేకరణ కోసం సిరాజ్ ఉర్ రహిమాన్, సయ్యద్ సమీర్‌లకు నిధులు అందించినట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. మరోవైపు బీహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ ఉగ్రకుట్రలో భాగస్వామిగా మారి ఆయుధాల సరఫరా కోసం సిరాజ్‌తో కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. అంతేకాదు సరిహద్దుల గుండా ఆయుధాలను అక్రమంగా తరలించడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికలను వినియోగించి తీవ్రవాద జిహాదీ భావజాలాన్ని ప్రచారం చేసినట్లు తమ దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందనీ, దేశ భద్రతకు ముప్పుగా మారేలా ఈ కుట్రను విస్తరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు సమర్పించిన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోందని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద నెట్ వర్క్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆయుధాల సరఫరా మార్గాలు, సోషల్ మీడియా ద్వారా నిర్వహించిన రహస్య కమ్యూనికేషన్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
విజయనగరం జిల్లాలో వెలుగుచూసిన ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఏ దర్యాప్తు పురోగతితో ఉగ్రవాద ముఠా కార్యకలాపాలపై మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.






