ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవం.. దూసుకుపోతున్న యూపీఐ

posted on: May 21, 2026 3:15PM

భారతదేశ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అద్భుతమైన మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు చేతిలో నగదు లేదా జేబులో ప్లాస్టిక్ కార్డులు ఉంటేనే మార్కెట్‌కు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ..  ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆ అవసరం లేకుండా కేవలం చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే సమస్త వ్యాపార లావాదేవీలు పూర్తవుతున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఊహించని రీతిలో వృద్ధి చెందడమే ఇందుకు ప్రధాన కారణం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్  (యూపీఐ) సాంకేతికత, దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. నేడు దేశవ్యాప్తంగా సాగుతున్న మొత్తం ఎలక్ట్రానిక్ నగదు బదిలీలలో సింహభాగం అంటే దాదాపు 85శాతం ఈ వ్యవస్థ ద్వారానే సాగుతుండటం విశేషం.

గడిచిన కొన్నేళ్లుగా దేశంలో డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా పడిపోతూవస్తోంది. గతంతో పోలిస్తే ప్లాస్టిక్ కార్డుల వాడకంలో భారీగా క్షీణత నమోదైనట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు యూపీఐ ద్వారా సులభంగా డబ్బులు పంపడానికి మొగ్గు చూపుతున్నారు. నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మొదలుకొని పల్లెటూళ్లలోని చిన్న కిరాణా దుకాణాల వరకు ప్రతిచోటా క్యూఆర్ కోడ్‌లు దర్శనమిస్తున్నాయి. వినియోగదారులు కూడా కార్డులను జేబులో పెట్టుకుని తిరిగే కన్నా, ఫోన్ ద్వారా ఒక్క క్లిక్‌తో చెల్లింపులు జరపడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ (స్వైపింగ్) యంత్రాలపై ఆధారపడే పరిస్థితి ఇప్పుడు వేగంగా తగ్గిపోతోంది.  ఈ డిజిటల్ విప్లవానికి వ్యాపార వర్గాల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. సాధారణంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించినప్పుడు వ్యాపారులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) పేరిట కొంత రుసుమును బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చేది. అయితే యూపీఐ విధానంలో ఇలాంటి అదనపు వసూళ్లు ఏవీ లేకపోవడం చిన్న వ్యాపారులకు పెద్ద ఉపశమనంగా మారింది. పైగా, వినియోగదారులకు కూడా బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు ఎంటర్ ఉండవు. సురక్షితమైన పిన్ నంబర్ నమోదుతో క్షణాల వ్యవధిలో నేరుగా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నిధులు బదిలీ అవుతుండటంతో ఈ విధానం అందరికీ చేరువైంది.  

ఒకప్పుడు కేవలం ఏటీఎంల నుండి డబ్బులు డ్రా చేయడానికి, ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఉపయోగపడిన డెబిట్ కార్డులు ఇప్పుడు తమ ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఏటీఎంల వద్దకు వెళ్లి నగదు తీసుకోవడానికి సైతం కార్డుల అవసరం లేకుండా యూపీఐ ఆధారిత విత్‌డ్రా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ కార్డుల మనుగడ  ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే..  క్రెడిట్ కార్డుల రంగానికి యూపీఐ కొత్త ఊపిరి పోస్తోంది.

సాధారణంగా ఆర్థిక వెసులుబాటు, రివార్డు పాయింట్లు, విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాల కోసం క్రెడిట్ కార్డులను వాడేవారు. ఇప్పుడు ఈ కార్డులను కూడా యూపీఐతో లింక్ చేసుకునే సదుపాయం రావడంతో, చేతిలో నగదు లేకపోయినా డిజిటల్ పద్ధతిలో అప్పు పొందే సౌలభ్యం కలుగుతోంది.  భారతదేశం రూపొందించిన ఈ అద్భుత సాంకేతికత ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తా చాటుతోంది. స్వదేశీ అవసరాల కోసమే కాకుండా గ్లోబల్ డిజిటల్ దౌత్య సాధనంగా యూపీఐ అవతరించింది. 

సింగపూర్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి పలు విదేశీ రంగాలు సైతం ఈ భారతీయ చెల్లింపుల విధానాన్ని తమ దేశాల్లో అధికారికంగా అనుమతిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో సగానికి పైగా వాటాను ఇండియాయే దక్కించుకోవడం విశేషం. వీసా, మాస్టర్‌కార్డ్ వంటి పాశ్చాత్య దిగ్గజ సంస్థల ఆధిపత్యానికి గట్టి పోటీనిస్తూ స్వదేశీ  రూపే  నెట్‌వర్క్‌తో కూడిన యూపీఐ, భారత సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలుస్తోంది.  

సాంకేతిక వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, దీనితో ముడిపడి ఉన్న సవాళ్లను కూడా విస్మరించలేము. ఆన్‌లైన్ లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో..  అదే స్థాయిలో సైబర్ నేరాలు, నకిలీ కాల్స్, ఓటీపీ మోసాలు కూడా విస్తరిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర వాణిజ్య బ్యాంకులు వినియోగదారులను చైతన్యపరిచేందుకు ఎన్ని రకాల భద్రతా మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పటికీ, అంతిమంగా ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం. అపరిచిత వ్యక్తులకు పిన్ నంబర్లు చెప్పకపోవడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 

రాబోయే రోజుల్లో బయోమెట్రిక్ ఆధారిత భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారానే ఈ డిజిటల్ ప్రయాణం నిరంతరాయంగా సాగుతుంది.  భారతదేశం రానున్న కాలంలో సుమారు 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు అత్యంత కీలకమైన చోదక శక్తిగా మారనున్నాయి. నగదు రహిత లావాదేవీల వల్ల ఆర్థిక రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా, అక్రమ చలామణీ, అవినీతి వంటి సమస్యలకు అడ్డుకట్ట పడుతుంది. సమాజంలోని సామాన్య పౌరుడిని సైతం బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకువచ్చి, దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామిని చేయడంలో యూపీఐ సాధించిన విజయం నిజంగా అభినందనీయం. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ డిజిటల్ రంగాన్ని శాసిస్తున్న భారత్, మున్ముందు మరెన్నో రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...