భారత ప్రజాస్వామ్యానికి కొత్త ఇల్లు..!

posted on: Aug 6, 2016 9:57AM

 

ప్రతి భారతీయుడు ఢిల్లీ వెళితే చూడాలనుకునే వాటిలో అగ్రస్థానంలో ఉండేవి ఒకటి పార్లమెంట్ భవనం, రెండోది తాజ్‌మహల్. భారత ప్రజాస్వామ్యానికి పెట్టని కోటలా..దేశ రాజధాని నడిబొడ్డున రాజఠీవిని తలపిస్తూ ఎనిమిది దశాబ్ధాలుగా పైబడి చట్ట సభలకు అతిథ్యమిస్తున్న అపురూప కట్టడం పార్లమెంట్ భవనం. తెల్లవాడి బానిస సంకెళ్ల నుంచి విముక్తిని పొందడం నుంచి..మనల్ని మనం స్వేచ్ఛగా పరిపాలించుకునేలా రూపొందిన రాజ్యాంగ నిర్మాణానికి సజీవ సాక్ష్యం పార్లమెంట్. అక్కడే అనేక మంది రాజకీయ నాయకులు దేశాన్ని పాలించారు. అక్కడే అనేకమంది పెద్ద రాజకీయయోధులుగా రాటుదేలారు. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు, దేశ గతిని మలుపు తిప్పిన సంస్కరణలు పురుడు పోసుకున్న స్థలం. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. అన్ని సంవత్సరాలు సేవలందించిన పార్లమెంట్ ప్రస్తుతం ఇరుకైందట.

 

అందుకే అత్యాధునిక వసతులతో కూడిన మరో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ ప్రతిపాదనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదం తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనం కావాలని గతేడాది డిసెంబర్ 27న స్పీకర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. కొత్త భవనం అవసరాల గురించి చెబుతూ స్పీకర్ పలు కారణాలను లేఖలో పొందుపరిచారు. 2026 నాటికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 81లోని క్లాజ్ (3) మేరకు జనాభా ప్రతిపాదికన లోక్‌సభలోని సీట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం భవనం 1927లో నిర్మితమైందని, అప్పుడు ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, మీడియా సందర్శకులు, పార్లమెంట్ కార్యకలాపాలు పరిమితంగా ఉండేవని, అయితే కాలం గడిచేకొద్దీ ఇవన్నీ పలు రెట్లు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. కమిటీలు, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని, స్థల అవసరాల డిమాండ్లు పెరిగాయని సుమిత్ర లేఖలో వివరించారు. అలాగే లోక్‌సభ ఛాంబర్‌ను రీడిజైనింగ్ చేయాలని, సిట్టింగ్ ఏర్పాట్లను పునరుద్దరించాలన్నారు. ఇప్పుడున్న భవనం హేరిటేజ్ గ్రేడ్-1 కింద ఉన్నందున మరమ్మతులు, ఆధునీకరణలకు చాలా పరిమితులున్నాయని చెప్పారు. అయితే లేఖలో స్పీకర్ రెండు ప్రత్యామ్నాయ స్థలాలను పొందుపరిచారు. ఒకటి, ప్రస్తుత పార్లమెంట్ కాంప్లెక్స్‌లో, ఇంకొక స్థలాన్ని రాజ్‌పథ్‌కు అటు వైపు.

 

లేఖపై స్పందించిన వెంకయ్య..దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారుల పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదనపై పట్టణాభివృద్ధి శాఖ నోట్ రూపొందిస్తుంది, తదనంతరం దీన్ని కేబినెట్ పరిశీలిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజ్‌పథ్ వద్ద ఉన్న వాయు భవన్ వెనుక కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించే అవకాశం ఉంది. కొత్త భవన సముదాయాన్ని, ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని అనుసంధానిస్తూ భూగర్భంలో మార్గం నిర్మించవచ్చని సమాచారం. అయితే నూతన భవన నిర్మాణంపై నాయకులు, నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ భవనం పనితీరును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని..అవసరాలకు తగిన విధంగా మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరో వందేళ్లపాటు సేవలందించగలదని బల్లగుద్ది మరి చెబుతున్నారు. అంతగా అవసరమైతే పార్లమెంట్ సమీపంలోనే కొన్ని కార్యాలయాలు నిర్మించుకోవచ్చునని సూచిస్తున్నారు. మనకంటే ఎంతో ముందు పార్లమెంట్ భవనాలు నిర్మించుకున్న దేశాలు ఇప్పటికీ వాటితోనే సరిపెట్టుకుంటూ అద్భుతంగా నిర్వహంచుంటుండగా..మన పార్లమెంట్ భవనానికి తీరా వందేళ్లు కూడా నిండక ముందే కొత్త భవనం కోసం చూడటం ఏ మాత్రం హర్షనీయం కాదంటున్నారు కొందరు.

google-ad-img
    Related Sigment News
    • Loading...