Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికాలో ఇండియన్ ఉద్యోగులకు కొత్త తలనొప్పి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వేధింపులు
posted on: Apr 25, 2026 4:03PM

అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడి, అక్కడి ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ H-1B వీసా ఉద్యోగులు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మున్నెన్నడూ లేని విధంగా.. కొంతమంది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు అమెరికా ఫస్ట్ నినాదాన్ని అడ్డం పెట్టుకుని భారతీయ ఉద్యోగులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే నెపంతో.. ప్రైవేట్ వ్యక్తులు కెమెరాలతో భారత హఎచ్ 1బి వీసా ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలకు, వారి నివాసాలకూ కూడా వెళ్లి హల్‌చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నది. ఈ వేధింపుల పర్వం సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్లు పబ్లిక్ రికార్డుల ద్వారా లభ్యమయ్యే చిరునామాలను పట్టుకుని,హెచ్ 1బి వీసా స్పాన్సర్ కంపెనీలు, భారతీయ వ్యాపార సంస్థలు, చివరకు వారి ఇళ్లకు కూడా వెళ్లి ప్రశ్నిస్తున్నారు.
మీ వీసా స్థితి ఏమిటి? మీరు ఇక్కడ చట్టబద్ధంగానే పని చేస్తున్నారా? ఈ సంస్థ అసలు ఉనికిలో ఉందా? అంటూ కెమేరాల ముందు నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలా తీసిన వీడియోలను ఎడిట్ చేసి, తప్పుదోవ పట్టించే శీర్షికలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యూస్ సంపాదించుకుంటున్నారు. అమెరికాలో ఉన్న మొత్తం హెచ్1బి వీసా దారుల్లో దాదాపు 70 శాతం మంది ఇండియన్సే కావడంతో, వీరే ఈ ఇన్ ఫ్లుయెన్సర్లకు టార్గెట్ గా మారుతున్నారు. ముఖ్యంగా ఐటీ, కన్సల్టింగ్ రంగాల్లోని ఇండియన్స్ ను టార్గెట్ చేసి అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు లాగేసుకుంటున్నారు అనే వివాదాస్పద చర్చను రాజేయడం వీరి ఉద్దేశంగా కనిపిస్తోంది.
రాజకీయంగా ఉన్న వలస వ్యతిరేక ధోరణులను వాడుకుంటూ, నిజానిజాలతో సంబంధం లేకుండా ఇండియన్ కమ్యూనిటీని ఇబ్బందులకు గురిచేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ నిపుణులు, న్యాయవాదులు భారతీయ ఉద్యోగులకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. సోషల్ మీడియా కోసం తిరిగే ఏ ప్రైవేట్ వ్యక్తికీ మీ వ్యక్తిగత లేదా వీసా సమాచారాన్ని అడిగే చట్టబద్ధమైన అధికారం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. లేబర్ కండిషన్ అప్లికేషన్ (ఎల్సీఏ) వంటి పత్రాలను కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే చూపించాల్సి ఉంటుంది. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కెమెరాలతో మీ ఇంటి తలుపు తట్టినా, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉందని గుర్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇలాంటి ఇన్ ఫ్లుయెన్సర్లతో వాదనకు దిగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వారు మీ మాటలను వక్రీకరించి, నెగటివ్ నేరేటివ్‌ను సృష్టించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఎవరైనా తాము ప్రభుత్వ అధికారులమని చెబితే.. ముందుగా వారి ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేయాలని, వారి వివరాలు నోట్ చేసుకున్న తర్వాతే మాట్లాడాలని సూచిస్తున్నారు. చట్టపరంగా మీరు సరైన స్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి స్వయం ప్రకటిత విచారణాధికారులకు భయపడాల్సిన పని లేదని వారు భరోసా ఇస్తున్నారు.
ఈ ధోరణి కేవలం డిజిటల్ కంటెంట్ కోసమే కాకుండా, ఒక వర్గాన్ని కించపరిచేలా సాగుతుండటంపై కమ్యూనిటీ నాయకులు మండిపడుతున్నారు. వీసా విధానాలపై చర్చలు జరగాల్సింది చట్టసభల్లో కానీ, రోడ్ల మీద వ్యక్తులను హరాస్ చేస్తూ కాదంటున్నారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున, భారతీయ ఉద్యోగులు తమ చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవడమే సరైన రక్షణ మార్గమని స్పష్టమవుతోంది.
-సీతారాం కంఠంనేని






