డిజిటల్ రాజకీయాల కొత్త యుగం!

posted on: May 11, 2026 5:52PM

 తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. భావోద్వేగాలు, సినిమా గ్లామర్,   కుల సమీకరణాలతో ముడిపడి ఉండే ద్రవిడ రాజకీయాల్లో ఇప్పుడు ఒక భారీ మార్పు చోటుచేసుకుంటోంది. క్షేత్రస్థాయి ప్రచారానికి భిన్నంగా, అత్యాధునిక సాంకేతికతను వాడుకుంటూ ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేసే  డిజిటల్ యుద్ధం మొదలైంది. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో  టీవీకే విజయ్ తన రాజకీయ ప్రచారం కోసం ఏకంగా రూ. 3,000 కోట్లకు పైగా డిజిటల్ మార్కెటింగ్ కోసం వెచ్చించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలు వాస్తవమా? కాదా అన్నది పక్కన పెడితే.. ఇది ఆరోగ్యకరమైన రాజకీయ ప్రచారమా?  డిజిటల్ మాయాజాలంతో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నమా?  అన్న చర్చ మొదలైంది.  ఈ ఆరోపణల వెనుక ఉన్న యంత్రాంగం అత్యంత విస్మయకరంగా ఉంది. బయటపడిన వివరాల ప్రకారం..  వేలాది వాట్సాప్,  ఇన్ స్టాగ్రామ్ గ్రూపులను నిర్వహిస్తూ,   600 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు భారీగా డబ్బు చెల్లించి అనుకూల ప్రచారాన్ని చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కేవలం ప్రచారం మాత్రమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలపై వ్యతిరేక కథనాలను ప్రచారం చేయడానికి  కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. రోజుకు వెయ్యికి పైగా పోస్టులు చేయడం కోసం 12 ఐటీ సెంటర్లను 24 గంటల పాటు నడిపారన్న వార్తలు కూడా వినవస్తున్నాయి.  మరీ ముఖ్యంగా.. ఏఐ, బాట్   అకౌంట్ల వాడకం జరిగిందని ఆరోపణలున్నాయి. పాతిక వేల కంటే  ఎక్కువ బాట్ అకౌంట్ల ద్వారా కృత్రిమంగా ఒక వ్యక్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరిగిందంటున్నారు. ఇది కేవలం సాధారణ సోషల్ మీడియా వాడకం కాదనీ..  ఒక కార్పొరేట్ తరహా డిజిటల్ యుద్ధ తంత్రాన్ని తలపించిందన్న చర్చ జరుగుతోంది. అలాగే  ప్రత్యేక టీవీ ఛానెల్ ద్వారా కూడా ఈ ప్రచారాన్ని   ఉధృతంగా సాగించారని చెబుతున్నారు.  ఇంత భారీ స్థాయి వ్యయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తతున్నప్పుడు..  అసలు ఈ నిధుల మూలాలు ఎక్కడ ఉన్నాయనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. 

ఈ నిధులు ప్రధానంగా మూడు మార్గాల ద్వారా వచ్చి ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వీటిలో మొదటిది, సినీ పరిశ్రమలో విజయ్ కు ఉన్న  ఉన్న భారీ మార్కెట్  ద్వారా వచ్చే కోట్లాది రూపాయల లిక్విడిటీ. ఇక రెండవది..  తమిళనాడులోని బలమైన రియల్ ఎస్టేట్,  మీడియా గ్రూపుల నుండి అందుతున్న కార్పొరేట్ ఫండింగ్. చివరిది..  ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమిళ డయాస్పోరా(ఎన్ఆర్ఐ) ద్వారా పెట్టుబడులు. ఈ నిధుల సేకరణ వెనుక ఉన్న పారదర్శకతపై విచారణ అవసరమని ఇప్పుడు  ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ డిజిటల్ వ్యూహాల ప్రధాన లక్ష్యం యువతను ఆకర్షించడం. తమిళనాడులో 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు అధికంగా ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్, వాట్సాప్ వంటి మాధ్యమాలపై ఆధారపడతారు. నిరంతరం వేల సంఖ్యలో పోస్టులు చేయడం ద్వారా..  సదరు నాయకుడు మాత్రమే గెలవబోతున్నారనే  మానసిక స్థితిని ఓటర్లలో కల్పించడం ఈ డిజిటల్ నెట్ వర్క్ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఇది ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని దెబ్బతీయడం కిందకే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.  

ఒక చిన్న రాజకీయ పార్టీ పదేళ్లపాటు నడిపే బడ్జెట్ ను కేవలం డిజిటల్ ప్రచారం కోసమే వినియోగించడం అనేది ప్రజాస్వామ్య నైతికతకు విరుద్ధమనే వాదనలూ వినవస్తున్నాయి.  నకిలీ నేరేటివ్ లతో, పెయిడ్ ఇన్ ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని వక్రీకరించడం అనేది డిజిటల్ మోసంగా పరిగణించాల్సి ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. రాజకీయాలు ప్రజల సమస్యల చుట్టూ కాకుండా...   డిజిటల్ బింబాల చుట్టూ తిరగడం ఆందోళనకరమంటున్నారు.  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ఎన్నికల కమిషన్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.  రాజకీయ పార్టీల డిజిటల్ ఆడిటింగ్ నిర్వహించడం, బాట్ అకౌంట్లపై నియంత్రణ విధించడం, నిధుల సమీకరణలో పారదర్శకతను పెంచడం వంటి అంశాలపై చర్చ జరగాలి. లేని పక్షంలో, ప్రజాస్వామ్యం ప్రజల చేతుల్లో కాకుండా..  కేవలం అపారమైన డబ్బు,  సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొద్దిమంది చేతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది.   సరే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీవీకే పార్టీ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు   3వేల కోట్ల రూపాయల ఆరోపణల పై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ ఆరోపణలకు కేవలం టీవీకేకి సంబంధించినవే కావు.. అలాగే ఏదో  ఒక రాజకీయ పార్టీకి సంబంధించినదిగా తేలిగ్గా తీసుకోవడానికి లేదు.  ఈ ఆరోపణలు   మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ గా పరిగణించాల్సి ఉంటుంది.   ఓట్లు అనేవి కేవలం సోషల్ మీడియాలో వచ్చే లైకుల ద్వారా కాకుండా..  ప్రజల నిజమైన ఆకాంక్షల ద్వారా రావాలి.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి


 

google-ad-img
    Related Sigment News
    • Loading...