Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెంగాల్‌లో కొత్త అధ్యాయం: రాజకీయ విజయానికి మించి.. నాగరికత పునరుద్ధరణే లక్ష్యం!
posted on: May 11, 2026 5:03PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం అనేది కేవలం ఒక సాధారణ ప్రభుత్వ మార్పుగా కాకుండా, శతాబ్ద కాలంగా కొనసాగుతున్న అణచివేత నుండి బెంగాల్ నాగరికతను విముక్తం చేసే ప్రక్రియగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు వరుసగా నాలుగు భిన్న రాజకీయ శక్తుల నీడలో నలిగిపోయిన బెంగాల్‌కు.. ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే ఒ అవకాశం లభించింది. ఇది కేవలం ఐదేళ్ల పరిపాలన కోసం వచ్చిన మార్పు కాదు, భావి తరాల భవిష్యత్తును నిర్ణయించే పునాదిగా కనిపిస్తోంది.
1911లో బ్రిటిష్ వారు తమ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినప్పుడే బెంగాల్ పతనం ఆరంభమైంది. ఆ రోజుల్లో బెంగాల్ సాధించిన మేధో, ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. నాటి నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రభుత్వం, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కమ్యూనిస్టులు ఈ తరువాత బెంగాల్ గడ్డను దశాబ్దంన్నర పాటు పాలించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ హయాంలలో కూడా బెంగాల్ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయింది. ఈ సుదీర్ఘ కాలంలో రాష్ట్రం తన పారిశ్రామిక ప్రాభవాన్ని, మేధో పరమైన ఆధిపత్యాన్ని కోల్పోతూ వచ్చింది.
చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 1820 నుండి 1940 మధ్య కాలంలో బెంగాల్ ప్రపంచానికి మేధావులను అందించింది. రవీంద్రనాథ్ టాగోర్ వంటి నోబెల్ విజేతలు, మేఘనాద్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు బెంగాల్ మట్టి నుండే ఉద్భవించారు. ఆధ్యాత్మిక రంగంలో రామకృష్ణ పరమహంస, వివేకానంద, అరబిందో వంటి మహానుభావులు హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. భారత జాతీయ గీతాలు సైతం బెంగాల్ నేల నుండే పుట్టాయి. అయితే.. 1947 విభజన, ఆ తర్వాతి పారిశ్రామిక వ్యతిరేక విధానాల వల్ల బెంగాల్ ఆర్థికంగా చితికిపోయింది.
1977 నుండి 2011 వరకు సాగిన కమ్యూనిస్టుల పాలనలో హింస, రాజకీయ అస్థిరత వల్ల విద్యావంతులైన యువత రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన తృణమూల్ పాలనలో కూడా సుమారు 6,600 కంటే ఎక్కువ కంపెనీలు తమ కార్యాలయాలను బెంగాల్ నుండి తరలించడం గమనార్హం. పారిశ్రామికంగా 27 శాతం వాటా కలిగి ఉన్న బెంగాల్.. ఇప్పుడు కేవలం 17 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో, బెంగాల్ మళ్ళీ పుంజుకోవాలంటే కేవలం ఆర్థిక మార్పులే కాకుండా.. సాంస్కృతిక ప్రక్షాళన కూడా అవసరమని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన బీజేపీ ముందు రెండు ప్రధాన కర్తవ్యాలు ఉన్నాయి. మొదటిది పాలనాపరమైన సంస్కరణలు. సరిహద్దు జిల్లాల్లో శాంతిభద్రతలను కాపాడటం, మహిళా భద్రతను పటిష్టం చేయడం, సిలిగురి కారిడార్ వంటి కీలక ప్రాంతాల భద్రతపై దృష్టి సారించడం, అలాగే.. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించి వాటి స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించడం చేయాల్సి ఉంది. అలాగే తాజ్‌పూర్ ఓడరేవు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాల్సి ఉంటుంది.
వీటికి తోడుగా.. సాంస్కృతిక పునరుద్ధరణ దృష్టి సారించాల్సి ఉంది. బెంగాల్‌లోని విద్యా సంస్థలను మళ్ళీ జ్ఞాన కేంద్రాలుగా మార్చాలి. వివేకానంద, సుభాష్ చంద్రబోస్ వంటి వారి వారసత్వాన్ని నేటి తరానికి సరిగ్గా అందించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. బెంగాలీ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సిన అవసరం లేకుండా, రాష్ట్రంలోనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని నమ్మే వాతావరణాన్ని కల్పించాలి. 115 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్రం ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక అవరోధాలు తొలగిపోవడంతో.. ఈ సాస్కృతిక పునరుజ్జీవనం సాధ్యమవుతుందని పరిశీలకులు అంటున్నారు.
అయితే.. ఈ మార్పుల ప్రయాణంలో సవాళ్లు లేకపోలేదు. . సాంస్కృతిక పునరుజ్జీవనం అంశం రాజకీయ రంగు పులుముకోకుండా చూడటం బీజేపీకి పెద్ద పరీక్షగా మారనుంది. రాష్ట్రంలోని మైనారిటీల హక్కులను కాపాడుతూ.. అందరినీ కలుపుకుని పోయే సమగ్ర అభివృద్ధిని సాధించాల్సి ఉంది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన దుర్గాపూజ, శాంతినికేతన్ వంటి వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, ఆధునిక బెంగాల్‌ను నిర్మించడంపైనే కొత్త ప్రభుత్వ విజయం ఆధారపడి ఉంటుంది.
ఇక చివరగా.. చరిత్రకారులు చెబుతున్నట్లుగా పునరుజ్జీవనాలు ఎప్పుడూ పూర్తిగా అంతం కావు.. అవి కేవలం ప్రభుత్వాల శత్రుత్వం వల్ల తాత్కాలికంగా ఆగిపోతాయి. 1941లో టాగోర్ మరణంతో ముగిసినట్లుగా కనిపించిన బెంగాల్ వైభవం.. ఇప్పుడు మళ్ళీ చిగురించే అవకాశం కనిపిస్తోంది. అనుకూలమైన రాజకీయ వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో, బెంగాలీ ప్రజల మనోధైర్యానికి ప్రభుత్వ చిత్తశుద్ధి తోడైతే బెంగాల్ మళ్ళీ భారత దేశానికి దిక్సూచిగా మారుతుందనడంలో సందేహం లేదు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి






