నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా
posted on Sep 9, 2025 3:02PM

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో సైన్యం సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన దుబాయ్ నుంచి వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది.
దీంతో నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపుతప్పాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆందోళనకారులు రాజధాని ఖాట్మండులో విధ్వంసం సృష్టిస్తున్నారు.
సోషల్ మీడియాపై బ్యాన్, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి నేపాల్‌లో మరింత హిసాత్మకంగా మారాయి. పార్లమెంట్ ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది ప్రజలు మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి.
దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు.. హోంమంత్రి రాజీనామా చేసినా ప్రజల నిరసనలు ఆగకపోవడంతో.. ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే ఛాన్స్ ఉంది