TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘనంగా ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగ

Published on: Fri Jun 26, 2026 8:21AM

మత సామరస్యానికి ప్రతీకగా, కులమతాలకు అతీతంగా సాగే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగ  శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని  బారాషహీద్‌ దర్గా వేదికగా..  పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు ఒడ్డున  జరిగే ఈ ఐదు రోజుల వార్షిక మహోత్సవాలు  వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం (జూన్ 26) నుంచిఈ నెల 30 వరకు జరిగే ఈ వేడుకల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు నెల్లూరుకు తరలివస్తున్నారు.    గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ పవిత్ర దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని, అందుకు కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి సంప్రదాయం  ఒక పవిత్ర  ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది. 

ఈ   పండుగలో ప్రధాన ఆకర్షణ రొట్టెల మార్పిడి.  ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతానం, విద్య, వ్యాపారాలు ఇలా తమ కోరికలు నెరవేరిన భక్తులు కృతజ్ఞతగా స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను ఇతరులకు సమర్పిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునే వారు ఆ రొట్టెలను భక్తితో పుచ్చుకుంటారు. ఇలా కోర్కెలు తీరిన వారు ఇచ్చే రొట్టెలను అందుకోవడం వల్ల తమకు కూడా మంచి జరుగుతుందని  విశ్వాసం. ఈ  గౌరవిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.  
ఈ ఏడాది రొట్టెల పండుగకు  14 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.  మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు.

భక్తుల సౌకర్యార్థం స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక ఘాట్లు, సురక్షిత  తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్లు, అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.  అలాగే.. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటు షికారు భక్తులను  ఆకట్టుకుంటోంది. భద్రత పరంగా ఎలాంటి అవాంచేనీయ సంఘటనలు జరగకుండా  భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నిఘా కోసం  డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.