అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం
posted on Oct 27, 2025 4:16PM

నెల్లూరు జిల్లా జలదంకి మండలం చిన్న క్రాక గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులు గోళ్ల రమేష్, అనూష, శశాంత్, మన్విత్ వారి అంత్యక్రియలకు హాజరై, వింజమూరు మండలంలోని గొల్లవారి పాలెం నుంచి తిరిగి విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
గాయపడిన వారిలో సుమలతకు తలకు తీవ్ర గాయం కాగా, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మౌనిక, కృష్ణ, కృష్ణ చైతన్య, మరో మహిళ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మౌనికకు కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కావలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.