బేంబూ వాలా దీదీ.. నేహ విజయగాధ.. ఎందరికో స్ఫూర్తిదాయకం!

posted on: Feb 17, 2026 8:27AM

సంక్షోభాలలో అవకాశాలు వెతుక్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. అలా రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన సంక్షోభం నుంచి అవకాశాలను అన్వేషించి పేరు వినా మరేమీ మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి బాటలో నడిపారు. నడిపిస్తున్నారు.  చంద్రబాబును ఆదర్శంగా తీసుకుందో ఏమో ఓ యువతి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి విజయం సాధించింది.  రూ. 5 వేలు కూడా అప్పుపుట్టని పరిస్థితి నుంచి  నెలకు రూ.50 వేలు సాధించే స్థితికి చేరుకుంది.

ఆమె పేరు నేహ. రాంచీకి చెందిన ఈ యువతి  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే సరైన ఉద్యోగం దొరక లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ స్థితిలో తనకు తెలిసిన పెయింటిగ్ ను వృత్తిగా మార్చుకోవాలని తలపోసింది. అయితే అందుకు అవసరమైన పెట్టుబడి డబ్బు ఆమె వద్ద లేదు. ఒక్క ఐదు వేల రూపాయలు అప్పుదొరికితే చాలు.. తాను అనుకున్నది చేయగలనన్న ఆత్మవిశ్వాసం నేహది. అయితే ఆమెకు ఆ ఐదువేలు అప్పు ఇచ్చేవారే కరవయ్యారు.  దీంతో ఆమె ఏం చేయాలి? అసలు తానేమైనా చేయగలనా? అని దిగులు పడింది. ఆ పరిస్థితుల్లో తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో ప్రభుత్వం నుంచి రూ. 50 వేల రూపాయల రుణం తీసుకుంది.  ఆ సొమ్ముతో వెదురుతో వస్తువులు,   ఆభరణాలు తయారు చేయడంలో శిక్షణ పొందింది.  అలా శిక్షణ పొందిన నేహ వెదురుతో   నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌లు తదితర ఆర్నమెంట్స్ తయారు చేసి, వాటిపై తన పెయింటింగ్ నైపుణ్యం ఉపయోగించి ఆర్గానిక్ పెయింటింగ్ చేయడ మొదలు పెట్టింది.   పర్యావరణ హితం, చూడడానికి అద్భుతంగా కనిపించే ఈ ఆభరణాలకు మంచి గిరాకీ లభించింది.

పర్యావరణ ప్రేమికులు నేహ తయారు చేసే ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆమె వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. కేవలం రాంచీకే పరిమితం కాకుండా.. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా లలో  జరిగే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇప్పుడు నేహకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. తన ప్రతిభ, నైపుణ్యానికి సానబట్టి, సృజనాత్మకతతో ఆమె చేస్తున్న వెదురు ఆభరణాల ద్వారా ఇప్పుడు ఆమె నెల సంపాదన రూ. 50 వేలు దాటింది. దీంతో ఆమె తన కుటుంబాన్ని కూడా పోషించగలుగుతున్నారు. ఆర్థికంగా స్థరపడ్డారు. ఇప్పుడంతా ఆమెను బేంబూ వాలీ దీదీ అని పిలుస్తున్నారు.  వివాహాలు,   రిసెప్షన్ల కోసం ఆమె వెదురు ఆభరణాలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడు నేహ లేడీ ఎంటర్ పెన్యూర్.  తనలా ఉపాధి కోసం వెతుక్కుంటున్న వారికి వెదురు ఆభరణాల తయారీలో శిక్షణనిస్తూ మరింత మంది లేడీ ఎంటర్ పెన్యూర్ లను తయారు చేస్తున్నది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...