యన్.డీ.టీ.వీ. తాజా సర్వే: సీమాంధ్రలో తేదేపాకు 15యంపీ సీట్లు
posted on Apr 15, 2014 5:57AM
.png)
కొద్ది వారాల క్రితం యన్.డీ.టీ.వీ. వెలువరించిన ఓ సర్వే నివేదికలో సీమాంధ్రలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు అదే సంస్థ తాజాగా వెలువరించిన సర్వే నివేదికలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత కనబడుతోందని ప్రకటించింది. తాజా సర్వే నివేదిక ప్రకారం సీమాంద్రాలో తేదేపాకు-15, వైకాపాకు-9, కాంగ్రెస్-1 యంపీ సీట్లు రావచ్చని అంచనా వేసింది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకొన్న కారణంగానే వారి కూటమికి ప్రజలలో ఆదరణ పెరిగిందని పేర్కొంది. అయితే ఈ తాజా సర్వేలో తెదేపాతో పోలిస్తే వైకాపా వెనకబడిపోయినప్పటికీ, మొట్ట మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఏకంగా 9 యంపీ సీట్లు సాధించడం మాటలు కాదు.
ఇక తెలంగాణాలో ఇదే సంస్థ ఫిబ్రవరి నెలలో నిర్వహించిన సర్వేలో తెరాసకు-11, కాంగ్రెస్-5, బీజేపీ-0 యంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. మార్చి సర్వేలో కాంగ్రెస్ కొంత పుంజుకొని 7 సీట్లు సాధించే స్థితికి చేరుకోగా, తెరాస-11 స్థానాల నుండి ఒకేసారి 7 స్థానాలకు పడిపోయింది. ఇక ‘0’ అంచనాలతో మొదలయిన బీజేపీ ప్రస్థానం మార్చిలో-2, ఏప్రిల్-3 యంపీ స్థానాలకి పెరిగింది. అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సంస్థ వెలువరించిన సర్వే ప్రకారం తెరాస-8కి పెరగగా, కాంగ్రెస్ మళ్ళీ 5 సీట్లకు పడిపోయింది. కానీ, తెలంగాణాలో తెరాస ఆధిక్యత కనబరుస్తున్నపటికీ దానికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా తెదేపా-బీజేపీ కూటమి స్థిరంగా బలం పుంజుకొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో నరేంద్ర మోడీ ప్రచారం తరువాత బహుశః తెదేపా-బీజేపీ కూటమి మరింత పుంజుకోవచ్చునేమో!
ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత పరిస్థితిపై ఈ సర్వే నివేదిక అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి కేవలం 111 యంపీ స్థానాలు (వాటిలో కాంగ్రెస్ స్వయంగా సాధించుకొన్నవి-92) వస్తాయని అంచనా వేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 275 యంపీ స్థానాలు (వాటిలో బీజేపీ స్వయంగా సాధించుకొన్నవి-226 సీట్లు) సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకి స్పష్టమయిన ఆధిక్యత సాధిస్తుందని అంచనా వేసింది.