Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూఎస్ టాప్ స్టార్ట్ అప్ లలో.. ఇండియన్స్ దే టాప్ చెయిర్!?
posted on: Jun 8, 2026 4:56PM

ఎన్ఎఫ్ఏపీ.. 2026 నివేదిక ప్రకారం, భారతీయ వలసదారులు అమెరికాలో 96 బిలియన్ డాలర్ స్టార్టప్‌లను స్థాపించారు లేదా సహ స్థాపించారు. ఇది అన్ని దేశాల మూలాలతో పోలిస్తే అగ్రస్థానం. అలాగే మొత్తం 775 యుఎస్ యూనికార్న్‌లలో 455 అంటే 59శాతం వలసదారుల చేత స్థాపించబడినవని నివేదిక చెబుతోంది. ఇండియా- యూఎస్ యూనికార్న్‌లకు ఒక టాప్ సోర్స్ గా తెలుస్తోంది. అమెరికా స్టార్టప్‌ల ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు సహాయక పాత్రకాదు, ఒక మెయిన్ పిల్లర్ స్థాయికి చేరిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ నాటికి అమెరికాలోని 775 ప్రైవేటుగా నిర్వహిస్తోన్న బిలియన్ డాలర్ కంపెనీలలో 455 కంపెనీలకు వలసదారులే ఫౌండర్లు లేదా కో ఫౌండర్లుగా ఉన్నారు. వాటి సమగ్ర విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లుగా ఈ నివేదిక పేర్కొంది.
ఈ సంఖ్యల్లో భారతీయ మూలాల వ్యవస్థాపకులు 96 కంపెనీలతో ముందంజలో ఉండగా, ఇజ్రాయెల్- 60, యునైటెడ్ కింగ్‌డమ్- 47, చైనా- 41 కంపెనీలతో వరుసగా తరువాతి స్థానాలలో ఉన్నాయి. ఇది యాదృచ్ఛిక సక్సెస్ స్టోరీ కాదు.. అమెరికా ఇన్నొవేషన్ వ్యవస్థలో భారతీయ వలస ప్రతిభకు నిర్మాణాత్మక స్థానం ఉందని చూపించే డేటా ఇది.
అమెరికా ఆవిష్కరణల చరిత్రలో వలసదారుల పాత్ర కొత్తది కాదు. కానీ.. 2026 ఎన్ఎఫ్ఏపీ నివేదిక ఆ పాత్రను గణాంకాల రూపంలో.. అత్యంత బలంగా రుజువు చేస్తోంది. 2016లో ఎన్ఎఫ్ఏపీ కేవలం 87కు గాను కేవలం 44 స్టార్టప్‌లు వలసదారుల చేత స్థాపించబడ్డాయని చెప్పినప్పుడు, ఆ సంఖ్యే చర్చనీయాంశమైంది. 2026 నాటికి ఆ వృద్ధి 775లో 455కు చేరింది. అమెరికా ఆర్థిక వృద్ధి, టెక్నాలజీ క్లస్టర్లు, విశ్వవిద్యాలయాల పరిశోధన వ్యవస్థ, వెంచర్ క్యాపిటల్ కలిసి వలస వ్యవస్థాపకులకు వేదికను సృష్టించాయి. దీంతో భారతదేశం యూనికార్న్ ఫౌండ్రీ గా ఎదగడం సాంకేతిక ప్రతిభ, విద్య, అమెరికా మార్కెట్‌కు అనుకూలమైన వ్యవస్థల కలయికగా చూడాలి.
2016లో.. ఎన్ఎఫ్ఏపి తొలిసారి వలసదారుల ఆధిపత్యాన్ని గణాంకాలుగా చూపించింది. 87 కంపెనీలలో 44 కంపెనీలు వలసదారుల చేత స్థాపించబడ్డాయి. 2018 నాటికి అమెరికాలో 91 యూనికార్న్‌లు ఉండగా, వాటిలో 50కు వలస వ్యవస్థాపకులు ఉన్నారని తాజా నివేదిక వెనక్కి చూసి పోల్చింది.
2022లో ఈ చర్చ మరింత విస్తరించి.. వలసదారులు అమెరికా యూనికార్న్‌లలో అర్ధానికి పైగా వాటాను కలిగి ఉన్నారని మీడియాతో పాటు ఎన్ఎఫ్ఏపీ రిపోర్టులు చెబుతున్నాయి. 2026 నివేదికలో ఇది 775 కంపెనీలకు విస్తరించి, వలసదారులు 59శాతం కంపెనీలను స్థాపించారని, దాదాపు మూడింట రెండు వంతులు వలసదారులు లేదా వలసదారుల పిల్లలు స్థాపించారని పేర్కొంది.
ఎన్ఎఫ్ఏపీ నివేదిక ఒక కీలక చట్టపరమైన సమస్యను కూడా ఎత్తిచూపుతోంది. అమెరికా వలస చట్టం ప్రకారం ఒక విదేశీయుడు కంపెనీని స్థాపించి, తర్వాత దేశంలో దీర్ఘకాలికంగా ఉండేందుకు స్పష్టమైన, సులభమైన స్టార్టప్ వీసా మార్గం లేదు. నివేదిక ప్రకారం, విజయవంతమైన వలస వ్యవస్థాపకులు తరచూ విద్యార్థి వీసా, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్, కుటుంబ స్పాన్సర్‌షిప్ లేదా శరణార్థి మార్గాల ద్వారా మాత్రమే స్థిరపడగలిగారు.
అమెరికా కాంగ్రెస్ 2022లో స్టార్టప్ వీసా భావనను చర్చించినప్పటికీ.. అది చట్టంగా నిలబడే స్థాయికి చేరలేకపోయిందని నివేదిక గుర్తుచేస్తోంది. అంటే, అమెరికా వలసదారుల ప్రతిభతో లాభపడుతోంది.. కానీ అదే ప్రతిభకు చట్టబద్ధ మార్గాలను ఇవ్వడంలో వ్యవస్థ ఇంకా వెనుకబడే ఉంది.
నాయకత్వం, ఉద్యోగాలు, వలసదారుల ప్రభావం వ్యవస్థాపకుల వరకే ఆగదు. సీఎఫ్ఓ, సీటీవో, వీపీ ఆఫ్ ఇంజినీరింగ్ వంటి కీలక స్థానాల్లో.. కూడా వలసదారులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు.ఎన్ఎఫ్ఏపీ ప్రకారం దాదాపు 80 శాతం యుఎస్ యూనికార్న్‌లలో వలస వ్యవస్థాపకులున్నారు. వలసదారుల పిల్లలను కూడా కలుపుకుంటే ఈ వాటా సుమారు 66శాతానికి చేరుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వలస వ్యవస్థాపకులతో కూడిన ప్రతి బిలియన్ డాలర్ కంపెనీ సగటున 833 ఉద్యోగాలను సృష్టించిందని చెబుతోందీ నివేదిక. అది వలస ఈజీక్వల్టూ ఉద్యోగ నష్టము అనే రాజకీయ నినాదానికి పూర్తి విరుద్ధమైన వాస్తవం.
ఎన్ఎఫ్ఏపీ 15 మంది వలస వ్యవస్థాపకులను గుర్తించింది, వీరు రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ బిలియన్ డాలర్ కంపెనీలను నిర్మించారు. అందులో ఆరుగురు భారతీయ సంతతికి చెందినవారని చెబుతోందీ రిపోర్ట్. అందులో జ్యోతి బన్సాల్, మోహిత్ అరోన్, అశితోష్ గార్గ్, అరవింద్ జైన్, సచిన్ నయ్యర్, అజీత్ సింగ్ లాంటి పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది. భారతీయ మూలాల ప్రతిభ ఒక్కసారి విజయం సాధించడమే కాదు, పునరావృతంగా కంపెనీలు నిర్మించగల అపూర్వ సామర్థ్యం కలిగి ఉంది. ఇది వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, అమెరికా పెట్టుబడి వ్యవస్థలో.. భారతీయ టెక్ ప్రతిభకు ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం. చఈ విజయగాథను అమెరికా రాజకీయాల్లోని వలస వ్యతిరేక వాదనల నుంచి వేరుగా చూడలేం. ఒకవైపు వలసలపై కఠినతరం కోరే ధోరణి పెరుగుతుంటే, మరోవైపు అదే వలసదారులు అమెరికా టెక్ ఆర్థిక వ్యవస్థకు బలమైన గ్రోత్ ఇంజిన్‌గా పనిచేస్తున్నారు.
ఎన్ఎఫ్ఏపీ నివేదిక స్పష్టం చేస్తున్న సందేశం ఒక్కటే.. అమెరికా, అమెరికన్ డ్రీమ్ ను నిర్మించుకుంటున్నది.. వలస ప్రతిభను స్వీకరించడం ద్వారానే. భారతీయ వలసదారుల విజయాన్ని ప్రశంసించగానే సరిపోదు.. అదే సమయంలో భారత్‌లో ప్రతిభ ఎందుకు విదేశాలకు వెళ్లాల్సి వస్తుందో అనే ప్రశ్నకు కూడా ఆస్కారం ఏర్పరుస్తోంది. అంటే.. ఇది అమెరికా విజయగాథ మాత్రమే కాదు.. భారతదేశానికి చెందిన మానవ వనరులు, గ్లోబల్ మార్కెట్‌లో ఎందుకు వెలుపలికి పోతున్నాయన్న ప్రశ్న కూడా ఉత్పన్నం చేస్తోంది.
మీడియాలో ఈ అధ్యయనానికి విస్తృత స్పందన లభించింది. ఫోర్బ్స్, ఎస్ఎఫ్ క్రానికల్, ఎకనామిక్ టైమ్స్ వంటి వేదికలు వలసదారుల ఆధిపత్యాన్ని భారతీయ మూలాల ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాయి. అయితే కొన్ని ప్రసారాల్లో సంఖ్యలు మాత్రమే కాకుండా.. భావోద్వేగ భాష కూడా ఎక్కువగా కనిపించింది. ఇది వాస్తవాన్ని ఉద్ధృతం చేస్తుంది కానీ, కొన్ని సందర్భాల్లో విశ్లేషణను సరిగా చెప్పలేక పోతోంది. ఇక జర్నలిస్టిక్ దృష్టిలో ముఖ్యమైనది.. ఈ విజయాన్ని అద్భుతం గా మాత్రమే కాక, నిర్మాణాత్మక ఫలితంగా చదవడం. అంటే.. విద్య, వలస విధానం, పెట్టుబడి, అమెరికా మార్కెట్ నిర్మాణం కలిసి ఈ ఫలితాన్ని ఎలా సృష్టించాయో వివరించగలగాలి.
ఈ డేటా ప్రకారం, అమెరికా బిలియన్-డాలర్ స్టార్టప్ స్టోరీలో భారతీయ వలసదారులు కేవలం సైడ్ కేరెక్టర్స్ కాదు. వారు ప్రధాన పాత్రధారులుగా కనిపిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో.. భారతీయ వ్యవస్థాపకుల ప్రాధాన్యం ప్రత్యేకంగా కనిపిస్తోంది. దీని ప్రభావం అమెరికా ఉద్యోగ మార్కెట్, పెట్టుబడి ప్రపంచం, గ్లోబల్ టాలెంట్ పోటీలో ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది.
అంతే కాక, భారతదేశంలో బ్రెయిన్ డ్రెయిన్ అంశాన్ని కూడా మళ్లీ సీరియస్ చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. భారతీయ వలసదారులు 96 అమెరికా యూనికార్న్‌లను స్థాపించడం కానీ, సహ-స్థాపించడం కానీ చేశారు. మొత్తం 775 యుఎస్ బిలియన్-డాలర్ కంపెనీలలో.. 455 కంపెనీలు వలసదారుల చేత ప్రారంభించబడ్డాయి.
ఈ కంపెనీల కలిపి విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లు. ప్రతి వలస-స్థాపిత యూనికార్న్ సగటున 833 ఉద్యోగాలు సృష్టించింది. 15 మంది సీరియల్ యూనికార్న్ వ్యవస్థాపకుల్లో 6 మంది భారతీయ సంతతికి చెందినవారున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





