Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సింధు జలాల ఒప్పందం.. పాకిస్తాన్ బెదిరింపులు.. దీటుగా బదులిస్తున్న ఇండియా.!
posted on: Jul 3, 2026 4:28PM

దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న సరిహద్దు ఉగ్రవాదానికి, ఆ దేశం నుండి నిరంతరం వస్తున్న హెచ్చరికలకు వ్యతిరేకంగా ఇండియా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం. జల భద్రత అనేది కేవలం ఒక పక్షానికి ఇచ్చే రాయితీ కాదని, అది ఇండియా సార్వభౌమ హక్కు అని కుండబద్దలు కొట్టింది. ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం నిర్ణయం పాకిస్థాన్ ను కుదేలు చేసింది. దిక్కు తోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలోనే తమ దేశీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ పాలకులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. పాకిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన విద్యుత్, మరియు దేశీయ భద్రతా లోపాలను అధిగమించలేక.. అక్కడి నాయకత్వం ఆ నిందను భారత్‌పై నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2026 జూన్ చివరి వారంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, వాతావరణ మార్పుల మంత్రి, ప్రతిపక్ష నాయకులు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ 29న ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుతోందని, ఒప్పందాన్ని నిలిపివేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ఆ మరుసటి రోజే, అంటే గత నెల 30 వాతావరణ మార్పుల మంత్రి పాకిస్తాన్‌కు వచ్చే నీటిని ఆపితే చేతులు నరికేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరికొందరు నేతలు ఒక అడుగు ముందుకు వేసి, ఇది అణు యుద్ధానికి దారితీస్తుందంటూ మాట్లాడారు.
ఒప్పందం నేపథ్యం, అసమానతలు, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం, ప్రపంచ చరిత్రలోనే అత్యంత అసమానమైన నీటి పంపిణీ వ్యూహంగా పరిగణించబడుతోంది. ఈ ఒప్పందం ప్రకారం, ఆరు ప్రధాన హిమాలయ నదులను ఇరుదేశాల మధ్య విభజించారు. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు ఇవ్వగా.. సింధు, జీలం, చెనాబ్ నదులను పాకిస్తాన్‌కు కేటాయించారు. ఈ నదీ వ్యవస్థకు భారతదేశం ఎగువ పరీవాహక దేశంగా ఉన్నప్పటికీ.. మొత్తం నీటి పరిమాణంలో దాదాపు 80 శాతం వాటాను పాకిస్తాన్‌కు అప్పగించి, భారత్ కేవలం 20 శాతంతోనే సరిపెట్టుకుంది. గడిచిన ఆరున్నర దశాబ్దాలుగా పాకిస్తాన్ ఎన్నో యుద్ధాలకు తెగబడినా.. నిరంతరం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నా, ఇండియా బాధ్యతాయుతమైన దేశంగా ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూనే వచ్చింది. భారత్ వైపు నుండి పాకిస్తాన్‌కు వెళ్లే నదీ ప్రవాహాలను ఎప్పుడూ అడ్డుకోలేదు. అయితే.. ఈ మంచితనాన్ని పాకిస్తాన్ తన శాశ్వత హక్కుగా భావించి, భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తూనే ఉండటంతో న్యూఢిల్లీ తన వ్యూహాన్ని అనివార్యంగా మార్చుకోవాల్సి వచ్చింది.
పహల్గామ్ దాడి, భారత్ వ్యూహాత్మక అడుగు..
ఇరు దేశాల మధ్య సంబంధాలలో కీలక మలుపు ఏప్రిల్ 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడితో సంభవించింది. జమ్మూ కాశ్మీర్‌లో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది భారత పౌరులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దారుణానికి ప్రతిగా, భారతదేశం కేవలం సరిహద్దు చర్యలకే పరిమితం కాకుండా, పాకిస్తాన్ భూభాగంలోని 11 వైమానిక స్థావరాలపై సుమారు 88 గంటల పాటు ఉమ్మడి సైనిక చర్యను నిర్వహించింది. దీనితో పాటే, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత్ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయలేదు.. కేవలం పునః చర్చల కోసం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ప్రణాళికాబద్ధమైన చర్య ద్వారా భారత్ తన గట్టి సంకల్పాన్ని చాటిచెప్పగా, పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాల ముందు బాధితురాలిగా నటించేందుకు ప్రయత్నిస్తోంది.
భారత జలవిద్యుత్ ప్రాజెక్టులు - వాస్తవాలు
ఇండియా పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని అక్రమంగా ఆపుతోందని ఇస్లామాబాద్ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు. భారత జలవనరుల శాఖ మంత్రి స్పష్టం చేసినట్లుగా.. నదీ ప్రవాహాలను నిలిపివేయడం లేదు. కేవలం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దేశీయ అవసరాల కోసం జలవిద్యుత్, నిల్వ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగానే భేల్హార్, సలాల్, దుల్హస్తి, ఉరి I, ఉరి II వంటి ప్లాంట్లతో పాటు నిము, కిషన్‌గంగా ఉపనదులపై కూడా భారత్ ప్రాజెక్టులను నిర్మించింది. ప్రస్తుతం చెనాబ్ నదిపై మరో మూడు కొత్త ఆనకట్టలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నిర్మాణాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, వాటిపై బాంబులు వేస్తామని పాకిస్తాన్ బెదిరించడం ఆ దేశ సైనిక అహంకారానికి నిదర్శనం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఎగువ పరీవాహక దేశానికి తన పరిధిలో నీటిని వాడుకునే, నిల్వ చేసుకునే పూర్తి హక్కులు ఉన్నాయి.
అంతర్జాతీయ చట్టాలు, ప్రపంచ దేశాల ఉదాహరణలు
ఐక్యరాజ్యసమితి చార్టర్ , అంతర్జాతీయ నదీ జలాల నిబంధనల ప్రకారం, ఎగువన ఉన్న దేశాలు దిగువ దేశాలకు గణనీయమైన హాని కలిగించనంత వరకు ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. అలాగే.. ఒక ఒప్పందాన్ని ఎదుటి పక్షం తీవ్రంగా ఉల్లంఘించినప్పుడు లేదా పరిస్థితులలో భారీ మార్పులు వచ్చినప్పుడు, ఆ ఒప్పందం నుండి వైదొలిగే హక్కు సదరు దేశానికి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 2018లో ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. 2026.. రష్యాతో కుదుర్చుకున్న START ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 2020.. ఈజిప్ట్, సూడాన్‌లతో కుదుర్చుకున్న నైలు నది ఒప్పందాన్ని ఇథియోపియా నిలిపివేసింది. ఈ దేశాలేవీ కూడా భారతదేశం ఎదుర్కొంటున్న స్థాయి సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి.. భారతదేశం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా పూర్తి సమర్థనీయమైనది.
నీరు, నెత్తురూ కలిసి ప్రవహించలేవు అంటూ ఇండియా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.. ఒకవైపు భారత పౌరులపై ఉగ్రదాడులు చేస్తూ, మరోవైపు నీటి ఒప్పందాలు సజావుగా సాగాలని కోరుకోవడం పాకిస్తాన్ మూర్ఖత్వమే అవుతుంది. పాక్ పదేపదే చేస్తున్న అణు బెదిరింపులు ఆ దేశ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అలాగే.. పాకిస్తాన్ లోపల నీటి పంపిణీ అంతా అక్కడి భూస్వామ్య, సైనిక శక్తుల చేతుల్లోనే ఉంది. నదుల్లో నీరు ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు అందకపోవడానికి వారి అంతర్గత అవినీతే కారణం. ఐఎంఎఫ్ నుండి అప్పుల కోసం దేవులాడే పాకిస్తాన్.. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం మానేస్తే ఆ దేశ పరిస్థితి మెరుగవుతుంది.
భవిష్యత్తులో జల సహకారం సజావుగా సాగాలంటే పాకిస్తాన్ కొన్ని కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవి..
- భారతదేశానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ఉగ్రవాద కర్మాగారాలను పూర్తిగా మూసివేయాలి.
- చిన్న విషయాలకు కూడా అణు యుద్ధాన్ని ప్రస్తావించడం మానుకోవాలి.
- దేశీయ నీటి వనరులపై ఉన్న సైనిక, భూస్వామ్య నియంత్రణను తొలగించి సామాన్యులకు నీటిని అందించాలి.
- ఆఫ్ఘనిస్తాన్, భారతదేశ సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించడం ఆపాలి
సింధు జలాల ఒప్పందంపై భారతదేశం ప్రస్తుత వైఖరి మారుతున్న ప్రపంచ పరిణామాలు, దేశ భద్రతకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారతదేశానికి ఉన్న ఎగువ నదీతీర హక్కులను ఎవరూ కాలరాయలేరు. పాకిస్తాన్ నిజంగానే శాంతిని, నీటి సరఫరాను కోరుకుంటే, అది తన ఉగ్రవాద విధానాలను పక్కనబెట్టక తప్పదు. అప్పటివరకు తన దేశ ప్రజల రక్షణ కోసం భారతదేశం తీసుకునే ప్రతి వ్యూహాత్మక చర్య చట్టబద్ధమైనది అలాగే అనివార్యమైనది కూడా.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






