ఇండియా, జపాన్ బయోగ్యాస్ భాగస్వామ్యం.. గోబర్ధన్ నుంచి గ్లోబల్ గ్రీన్ మొబిలిటీ వరకూ.!

posted on: Jul 8, 2026 5:33PM

ఇండియా,  జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కేవలం రక్షణ, మౌలిక వసతులు,  ఆర్థిక భద్రతకే పరిమితం కాకుండా పచ్చని భవిష్యత్తు వైపు  అడుగులు వేస్తున్నాయి.  ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్న ఈ రెండు దేశాలూ ఇప్పుడు భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా  దృష్టి సారించాయి. పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, సహకార రంగం ఆధారంగా  కంప్రెస్డ్ బయోగ్యాస్  ముఖ్యాంశంగా ఒక నూతన గ్రీన్ ఎనర్జీ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. జపాన్ ప్రధానమంత్రి సనా తకాఇచి ఇటీవలి  ఇండియా పర్యటన సందర్భంగా ఈ బృహత్తర  జపాన్, ఇండియా సీబీజీ ఇనిషియేటివ్  లాంఛనంగా ప్రారంభమైంది.  ఈ ఒప్పందం కింద 2030 నాటికి దేశవ్యాప్తంగా వెయ్యి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, పాతిక లక్షల సీఎన్‌జీ  వాహనాల మార్కెట్‌ను విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ ఇంధన ప్రాజెక్టు మాత్రమే కాదు, భారత గ్రామీణ ఆర్థిక ముఖచిత్రాన్ని, పశుసంవర్ధక రంగాన్ని, విశేషంగా  గోబర్ధన్  పథకానికి సమూలమైన ఊపునిచ్చే వ్యూహాత్మక అడుగుగా నిపుణులు చెబుతున్నారు.  ఈ ప్రతిష్టాత్మక భాగస్వామ్యం ద్వారా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే  విధానానికి ఒక కచ్చితమైన రూపం ఏర్పడనుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని సేంద్రియ వ్యవసాయ వనరులను ప్రోత్సహించే  గోబర్ధన్ ( పథకానికి ఈ అంతర్జాతీయ ఒప్పందం ద్వారా నూతన జవసత్వాలు లభించనున్నాయి. ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ,  ఇతర వ్యవసాయ వ్యర్థాలను ఒక క్రమపద్ధతిలో సేకరించి, వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో బయోగ్యాస్, బయో సీఎన్‌జీ,  సేంద్రియ ఎరువులుగా మార్చడం. 

ఇప్పుడు జపాన్ సాంకేతికత తోడుకావడంతో, కొత్తగా ఏర్పాటు చేయబోయే వెయ్యి ప్లాంట్లు దేశ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా..  పర్యావరణ అనుకూల ఇంధన వాహనాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నాయి.  జూలై 1 నుంచి 3 వరకు  జపాన్ ప్రధాని ఇండియా పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన 16వ వార్షిక సమ్మిట్ వేదికగా ఈ చారిత్రాత్మక నిర్ణయం,  లక్ష్యాల ప్రకటన వెలువడింది.  ఈ బృహత్తర ప్రణాళికకు గుజరాత్ లోని  బనాస్ డెయిరీ బయో-సీఎన్‌జీ మోడల్ ఒక ఆదర్శ నమూనాగా  నిలుస్తోంది. మారుతీ సుజుకి, సుజుకి మోటార్ కార్పొరేషన్,  నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్   సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్లాంట్..  పశువుల పేడ ఆధారిత మొబిలిటీకి ప్రపంచ స్థాయి ప్రయోగశాలగా గుర్తింపు తెచ్చుకుంది.  ఈ ప్లాంట్ ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి  లక్ష కిలోల పశువుల పేడను సేకరించి ప్రాసెస్ చేస్తుంది.  దీని ద్వారా రోజుకు  1,500 నుంచి 1,800 కిలోల బయో సీఎన్‌జీ ఉత్పత్తి అవుతుంది.  ఉత్పత్తి అయిన ఈ ఇంధనం ప్రతిరోజూ దాదాపు 170 నుంచి 200 సీఎన్‌జీ వాహనాలకు సరిపోతుంది.  పేడను సరఫరా చేసినందుకు గాను రైతులకు కిలోకు ఒక రూపాయి చొప్పున చెల్లిస్తారు.

దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం చేకూరడమే కాకుండా..  గ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయిన వ్యర్థాన్ని  అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి వ్యవసాయానికి వినియోగిస్తున్నారు.  ఈ ఒప్పందం కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా, కట్టుదిట్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ద్వారా అమల్లోకి వస్తోంది. భారత సహకార మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక,  పాడి పరిశ్రమల శాఖ, అలాగే జపాన్ ఆర్థిక, వాణిజ్య,  పరిశ్రమల మంత్రిత్వ శాఖ  మధ్య అధికారికంగా మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ (ఎంవోసీ) కుదిరింది. ఈ ఒప్పందం అమలులో సహకార సంఘాలు, పశుసంవర్ధక సంస్థలు, డెయిరీ కోఆపరేటివ్స్ అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే, బయో సీఎన్‌జీని ఒక క్లీన్ ఫ్యూయల్‌గా అధికారికంగా గుర్తించేందుకు భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పీఎన్జీఆర్బీ  వంటి ఇంధన నియంత్రణ సంస్థలు సరైన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది.  దీనితో పాటు..  ప్లాంట్ల ఏర్పాటుకు పర్యావరణ ప్రభావ అంచనా, స్థానిక పంచాయతీల అనుమతులు, అలాగే కార్బన్ క్రెడిట్ వ్యవస్థలతో అనుసంధానం, ధరల నిర్ణయం వంటి న్యాయపరమైన అంశాలపై ఇరు దేశాల ప్రభుత్వాలు ఒక పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.  

ఇండియాలో పశువుల పేడ ద్వారా గృహ అవసరాలకు బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం అనేది దశాబ్దాలుగా ఉన్నప్పటికీ, దానిని ఒక భారీ వాణిజ్య, రవాణా ఇంధన వనరుగా మార్చాలనే ఆలోచన గోబర్ధన్ పథకం ద్వారా వ్యవస్థీకృతంగా రూపుదిద్దుకుంది. మరోవైపు, భారత్, జపాన్ సంబంధాలు 2000వ దశకం ప్రారంభం నుంచి చూస్తే ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైళ్లు, బుల్లెట్ ట్రైన్ వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఆ గ్లోబల్ పార్టనర్‌షిప్, జపాన్ వారి  గ్లోబల్ సౌత్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు మద్దతుగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక పశుసంపద, పాల ఉత్పత్తి కలిగిన దేశాల్లో ఒకటైన ఇండియాలో పుష్కలంగా లభించే వ్యవసాయ వ్యర్థాలు, జపాన్ పెట్టుబడులు,  సాంకేతికతతో కలిస్తే సహజంగానే అద్భుత  ఇంధన వనరులు తయారవుతాయి.  ఈ రెండు దేశాల బలాలు ఒకేచోట కలవడం వల్లే సీబీజీ రంగం సహజంగానే ద్వైపాక్షిక సహకారానికి అనువైన వేదికగా మారింది.  అయితే..  ఈ ప్రాజెక్టుల అమలులో సామాజిక, ఆర్థిక కోణాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

బనాస్ డెయిరీ మోడల్‌లో రైతులకు కిలో పేడకు ఒక రూపాయి ఇస్తున్నప్పటికీ..  అది వారికి దీర్ఘకాలంలో వాస్తవంగా లాభదాయకమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే, రైతులు తమ పొలాలకు అవసరమైన సేంద్రియ ఎరువును బయట అమ్ముకోవడం వల్ల..  భవిష్యత్తులో వారు తమ సొంత వ్యవసాయానికి మార్కెట్లో ఆర్గానిక్ ఎరువులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తే ఈ ఆదాయం సరిపోకపోవచ్చు. అలాగే..  ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల దృష్ట్యా చూస్తే..  మారుతీ సుజుకి వంటి విదేశీ లేదా జపనీస్ సంస్థలు ఇప్పటికే భారత ఆటోమొబైల్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో..  బయో సీఎన్‌జీ రంగంలో కూడా వారే ముందు వరుసలో ఉంటే స్థానిక దేశీయ కంపెనీలకు పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  భవిష్యత్తులో ఈ  వెయ్యి ప్లాంట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే లాజిస్టిక్స్,  సాంకేతిక నిర్వహణ అనేది  పెద్ద సవాలుగా మారనుంది.  ప్రతి ప్లాంట్‌కు రోజుకు లక్ష కిలోల పేడను వేలాది రైతులు, పదుల సంఖ్యలో గ్రామాల నుంచి నిరంతరాయంగా సేకరించడం చిన్న విషయం కాదు. దీని కోసం బలమైన రవాణా వ్యవస్థలు, అడుగడుగునా కలెక్షన్ సెంటర్లు, రైతులకు పారదర్శకంగా డబ్బు చెల్లించే వ్యవస్థలను స్థానిక సహకార సంఘాలు ఎలా నిర్వహిస్తాయన్న దానిపైనే ఈ ప్రాజెక్టు విజయం ఆధారపడి ఉంటుంది.  అలాగే.. ఉత్పత్తి అయిన గ్యాస్‌ను శుద్ధి చేయడం, కంప్రెస్ చేయడం, భద్రపరచడం వంటి   ఇంజనీరింగ్ పనులకు గ్రామీణ స్థాయిలో సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం   ఉంది. 

ప్రభుత్వం అందించే సబ్సీడీలు, కార్బన్ క్రెడిట్స్ అలాగే సీఎన్‌జీ మార్కెట్ ధరలు..  అన్నీ సమర్థవంతంగా పనిచేస్తేనే భవిష్యత్తులో ఈ ప్లాంట్లు ఆర్థికంగా లాభదాయకతను సంతరించుకోగలవు.  మొత్తంగా చూస్తే..    ఇండియా-జపాన్ సీబీజీ ఇనిషియేటివ్ దేశ ఇంధన భద్రతలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.  

క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నఇండియాకు  బయో సీఎన్‌జీ ఒక  దేశీయ ప్రత్యామ్నాయంగా మారుతుంది. పశువుల పేడ నుంచి సహజంగా వాతావరణంలోకి విడుదలయ్యే మీథేన్ గ్యాస్‌ను పట్టుకుని ఇంధనంగా వాడటం వల్ల గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గి.. పారిస్ వాతావరణ ఒప్పందం,  దేశీయ పర్యావరణ లక్ష్యాలను  చేరుకోవడంలో ఇండియాకు ఎంతో సహాయపడుతుంది. ఇప్పటికే విక్రయమవుతున్న ప్రయాణికుల వాహనాల్లో 20 శాతానికి పైగా వాటాను సీఎన్‌జీ వాహనాలు ఆక్రమించడంతో భవిష్యత్తులో ఈ పర్యావరణ అనుకూల ఇంధనానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ..  భారీ స్థాయిలో ఈ ప్లాంట్ల ఏర్పాటులో స్థానిక సమాజం భాగస్వామ్యం, నీటి వినియోగం, పర్యావరణ ప్రభావం వంటి అంశాలను పారదర్శకంగా అంచనా వేసి బాధ్యతాయుతంగా అమలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. వాతావరణ హితమైన ప్రాజెక్టుల పేరిట రైతులు నష్టపోకుండా చూసుకుంటేనే ఈ ఇండో-జపాన్ భాగస్వామ్యం నిజమైన సక్సెస్ స్టోరీగా మారుతుంది. 

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.       

GOBARdhan Scheme, Banas Dairy Bio CNG, Compressed Biogas India, Suzuki Biogas Plant

google-ad-img
    Related Sigment News
    • Loading...