ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు!
posted on: Nov 13, 2025 12:52PM

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో గురువారం (నవంబర్ 13) దాడులు నిర్వహించింది. గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఎన్ఐఏ పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో దాదాపు పది చోట్ల గురువారం (నవంబర్ 13) విస్తృత తనిఖీలు నిర్వహించింది.
అనుమానితులు, వారి సహచరులకు సంబంధించిన స్థలాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. గుజరాత్ లో ఈ కేసు 2023లో నమోదైంది. నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు మొహమ్మద్ సోజిబ్ మియాన్, మున్నా ఖలీద్ అన్సారీ, అజ్రుల్ ఇస్లాం, అబ్దుల్ లతీఫ్ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. ఈ నిందితులు ఫేక్ ఐడీలను ఉపయోగించి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు.వారికి నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది.
బంగ్లాదేశ్ లోని అల్-ఖైదా కార్యకర్తల కోసం నిధులు సేకరించడమే కాకుండా, ఆ నిధులను వారికి బదిలీ చేసినట్లుగా తేలింది. అలాగే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ నవంబర్ 10, 2023న అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ నిషేధిత ఉగ్రవాద సంస్థలు అల్-ఖైదా, భారత ఉపఖండంలోని అల్-ఖైదా తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ పుణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేసింది. అలాగే థానేకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రశ్నించింది.






