Latest News

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

posted on: Mar 12, 2026 3:59PM

 

ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సోషల్‌ సైన్స్‌ పుస్తకంలో 'న్యాయ వ్యవస్థలో అవినీతి' పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇకపై ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం  విచారణ చేపట్టింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని ప్రొఫెసర్ మైఖేల్ డానినోతో పాటు టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లు రూపొందించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

దీనిపై స్పందించిన ధర్మాసనం.. “ప్రొఫెసర్ మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లకు భారత న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేకపోయి ఉండాలి. లేకపోతే విద్యార్థుల ముందు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరించి ఉండాలి” అని వ్యాఖ్యానించింది.రాబోయే తరాలకు పాఠ్యపుస్తకాలు రూపొందించే ప్రక్రియలో ఈ ముగ్గురికి ఎలాంటి పాత్ర ఉండకూడదని, వారిని వెంటనే పక్కనపెట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధులతో పూర్తిగా లేదా పాక్షికంగా సంబంధమున్న ఏ బాధ్యతలనూ వారికి అప్పగించకూడదని కూడా ఆదేశించింది.

న్యాయవ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ, పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కనీసం ఒక్క న్యాయ నిపుణుడికీ అవకాశం ఇవ్వకపోవడం అసంతృప్తికరమని ధర్మాసనం పేర్కొంది. ఎన్‌సీఈఆర్‌టీఈ లీగల్ స్టడీస్‌కు సంబంధించిన పాఠ్యప్రణాళిక రూపకల్పన కోసం వారం రోజుల్లోగా న్యాయ రంగానికి చెందిన నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది, అలాగే విద్యావేత్త ఒకరు ఉండాలని సూచించింది. 

వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీతో సంబంధం ఉన్నవారైతే మరింత సమగ్రంగా అంశాలు చేర్చే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద ఎన్‌సీఈఆర్‌టీఈ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 26న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సామాజిక మాధ్యమ వేదికలు, వ్యక్తుల వివరాలు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...