మంత్రి అయ్యాక కూడా కామెడీ మాననంటోన్న సిద్దూ!

 

కొందరు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు. కాని, మరికొందర్ని వెతుక్కుంటూ వివాదాలే బయలుదేరుతాయి. ఈ టైపుకే చెందుతాడు పంజాబ్ కే పాజీ.... సిద్దూ! క్రికెటర్ గా వున్నప్పుడు ఆయన కెరీర్ లో సిక్సులూ ఎక్కువే! కాంట్రవర్సీలు ఎక్కువే. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆయనని వదిలి వివాదాలు ఎక్కడికీ వెళ్లటం లేదు! హ్యాపీగా ఎన్నికల్లో గెలిచి మినిస్టర్ అయ్యాడో లేదో మరో వివాదం తరుముకొచ్చింది...

 

సిద్దూ గత పదిహేనేళ్లుగా ఎంపీగా వుంటూనే వున్నాడు. లోక్ సభలో వున్న ఆయన కాంగ్రెస్ లో చేరే ముందు  రాజ్యసభలో కూడా కనువిందు చేశాడు! కాని, ఎంపీగా ఎప్పుడూ మాత్రం సభలో ప్రశ్నలు సంధించి హడావిడి చేసిన దాఖాలాలు లేవు. మరి సిద్దూ ఏం చేస్తుంటాడు? కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే పాప్యులర్ షోలో రెగ్యులర్ గా కనిపిస్తాడు! పార్లమెంట్ లో కనిపించకపోయినా టీవీలో మాత్రం ఠీవీగా దర్శనమిస్తాడు!

 

తాజాగా జరిగిన ఎన్నికలకి ముందు సిద్దూ బీజేపీతో గొడవపడ్డాడు. ఆ పార్టీ వాళ్లు ఇచ్చిన రాజ్యసభ సీటు కూడా వద్దని వదిలేసి వచ్చి కాంగ్రెస్ లో చేరాడు. అదృష్టం బావుండీ ఆయన గెలవటం, పార్టీ గెలవటం, ప్రభుత్వం ఏర్పడటం చకచకా జరిగిపోయాయి. కాని, పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని లోలోన కలలుగన్న సిద్దూ కోరిక మాత్రం కాంగ్రెస్ లో సిద్ధించలేదు. కనీసం ఆయన్ని డిప్యుటీ సీఎంని కూడా చేయలేదు హస్తం పెద్దలు! ఎంతో సీనియర్ అయిన అమ్రిందర్ సింగ్ సిద్దూ ఉత్సాహాన్ని చిదిమేస్తూ ట్యూరిజమ్, కల్చర్ అండ్ లోకల్ బాడీస్ మినిస్టర్ని చేశాడు! అప్పట్నుంచీ సిద్దూ అసంతృప్తిగానే వున్నాడు!

 

ఎలాగూ తనకు కావాల్సినంత పెద్ద పదవి రాలేదు కాబట్టి పార్టీ పెద్దల మీద అలిగిన సిద్దూ రీసెంట్ గా మీడియా ముందు ఓ బాంబ్ పేల్చాడు. తాను ఇంత కాలం చేసిన కామెడీ షో ఇక మీదట కూడా కొనసాగిస్తానన్నాడు! రాష్ట్రానికి మంత్రై వుండీ ఇదేం చోద్యమని అందరూ అవాక్కయ్యారు. తరువాత మీడియా వారు ఈయన వ్యవహారం ఏంటని పంజాబ్ సీఎం కెప్టెన్ అమ్రిందర్ సింగ్ ని అడిగారు. ఆయన మొహమాటం లేకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ తరువాత సిద్దూతో మాట్లాడతానని అన్నారు. అంతే తప్ప మా వాడు సెలబ్రిటీ జడ్జ్ గా కామెడీ షోలో కూర్చుంటే తప్పేంటని వెనకేసుకు రాలేదు!

 

సిద్దూకి క్రికెట్ టీమ్ లో వున్నప్పుడు అజరుద్దీన్ లాంటి కెప్టెన్ లతో గొడవలు వస్తుండేవి! ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా పంజాబ్ సీఎం కెప్టెన్ అమ్రిందర్ తో పడుతున్నట్టు కనిపించటం లేదు. ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుని సిద్దూతో మాట్లాడతానంటే ... సిద్దూ ఏమో నేను షో లో కనిపించటం ఆపనని తెగేసి చెబుతున్నాడు. కపిల్ శర్మ షోలో తాను కనిపించటం ఆదాయం తెచ్చిపెట్టే పనేం కాదనీ ఆయన అంటున్నాడు. మంత్రిగా పని పూర్తయ్యాక తాను ఏం చేసుకున్నా అది ఎవ్వరికీ సంబంధం లేని విషయం అంటున్నాడు. చూడాలి మరి... చివరకు సిద్దూ కామెడీ షో వ్యవహారం ఆయనను కొత్తగా తమలోకి కాంగ్రెస్ పెద్దల మధ్య ఎలాంటి ట్రాజెడీగా మారుతుందో! లేక సిద్దూనే కాంప్రమైజ్ ఫార్ములాలో ముందుకు పోతాడో!