జాతీయ బాలికల దినోత్సవం.. ఆడపిల్లల భవితకు ఓ చేయూత..!
posted on Jan 24, 2026 1:37PM
.webp)
ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు. ఆడపిల్ల ఇంట్లో ఉండే మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని కూడా అంటారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఆడపిల్ల పుడితే పురిట్లోనే చిదిమేసేవారు, ఇంకొందరు బ్రూణ హత్యలు చేయించేవారు. ఈ కారణాల వల్ల ప్రస్తుతం మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంది. పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు కరువయ్యారు అంటూ పెద్దలు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఆడపిల్లల గురించి, వారి భవిత గురించి ఆలోచించి వారి అబివృద్ది కోసం ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు, బాలికల హక్కులు, వారి భద్రత, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకే ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజు గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
జాతీయ బాలికల దినోత్సవం..
2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development), భారత ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఈ రోజును జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది.
జనవరి 24నే ఎందుకు..
ఈ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక సంఘటన ఏమీ లేదు. కానీ బాలికల హక్కులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు, సంవత్సర ఆరంభంలోనే సమాజానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఎంపిక చేశారు.
ఎందుకు జరుపుకుంటారు..
సమాజంలో బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. బాల్యవివాహాలు, శిశుహత్యలు, లింగ వివక్షత, బాలికల విద్యకు అవకాశాల లోపించడం, ఆరోగ్యం, పోషణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రధాన లక్ష్యాలు..
బాలికలపై జరుగుతున్న వివక్షను తగ్గించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలు, ఆడ పిల్లలను పురిటిలో లేదా కడుపులోనే హత్య చేయడం, వంటి దారుణమైన కార్యకలాపాలను అరికట్టడానికి, బాలికల ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టడానికి తగినట్టు కార్యాచరణ చేయడమే ఈ రోజు ప్రధాన లక్ష్యాలలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా.. బాలికలు కూడా సమాజానికి ఒక బలం అనే భావనను పెంపొందించడం దీని లక్ష్యం.
ఎలా జరుపుకుంటారు..
పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం. వ్యాసరచన, ప్రసంగ పోటీలు, బాలికల హక్కులపై చర్చలు, ర్యాలీలు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. బాలికలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు.
బాలికల గౌరవం, హక్కులు, భవిష్యత్తుపై దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది. ముఖ్యంగా ఆడపిల్ల చదువు బారం అనే రోజు నుండి బాలిక చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది అని దేశం మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి రోజులను నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పించడం వల్లే వచ్చింది. బాలికల చదువును ప్రోత్సహించి, వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుల మీద ఖచ్చితంగా ఉంటుంది.
*రూపశ్రీ.