బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం!

posted on: Jun 6, 2026 9:16AM

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (జూన్ 5) రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది.  ముంబై నగరానికి ప్రయాణీకులతో బయలుదేరాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి రన్‌వేపై ఊహించని విధంగా పక్షి ఢీకొట్టింది. టేకాఫ్ తీసుకునే సరిగ్గా ఆఖరి నిమిషంలో ఈ బర్డ్ హిట్ ఘటన జరగడంతో అందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం గాల్లోకి లేవడానికి ముందే ఈ ప్రమాదం జరగడం, పైలట్  అప్రమత్తతతో వ్యవహరించడంతో  ప్రయాణికులు  సురక్షితంగా బయటపడ్డారు.

వివరాలిలా ఉన్నాయి.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఇ 6283  ఎయిర్‌బస్ ఏ321 నియో  విమానం   బెంగళూరు నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉంది. ప్రయాణికుల బోర్డింగ్ ప్రక్రియ అంతా ముగిసిపోయింది. విమానం రన్‌వే పైకి చేరుకుని, టేకాఫ్ కోసం వేగంగా దూసుకెళ్తున్న తరుణంలో ఒక పక్షి విమానాన్ని  ఢీకొట్టింది.  పక్షి ఢీ కొనడాన్ని గుర్తించిన పైలట్లు  సమయస్ఫూర్తితో విమాన వేగాన్ని నియంత్రిస్తూ రన్‌వే పైనే నిలిపివేసి.. తిరిగి విమానాశ్రయ బే  తరలించారు. విమానం ఒక్కసారిగా వెనక్కి తిరగడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, భయాందోళనలకు గురయ్యారు.    

ఏవియేషన్ నిబంధనల ప్రకారం ఇలాంటి బర్డ్ హిట్ ఘటనలు జరిగినప్పుడు విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విమానం రెక్కలు, విండ్‌షీల్డ్‌తో పాటు అత్యంత కీలకమైన రెండు ఇంజన్లను నిశితంగా పరిశీలించాలి. ఎయిర్‌పోర్టుకు చెందిన నిపుణులైన సాంకేతిక, ఇంజనీరింగ్ బృందాలు రంగంలోకి దిగి దాదాపు గంటన్నర పాటు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి.

విమాన ప్రయాణానికి ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, ప్రయాణం సురక్షితమేనని నిర్ధారించుకున్న తర్వాతే ఆ విమానానికి  ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ తనిఖీల ప్రక్రియ అంతా పూర్తి  అయిన తరువాత   ఆ ఇండిగో విమానం ప్రయాణికులతో సురక్షితంగా ముంబైకి పయనమైంది. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు గంటన్నరకు పైగా విమానాశ్రయంలో వేచి చూడాల్సి వచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...