మోడీకి కృతజ్ణతలు తెలిపిన నారా లోకేష్

posted on: Apr 2, 2026 1:00PM

ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పూర్తి  మెజారిటీతో పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి  ఏపీ విద్యా-ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఏపీ అసెంబ్లీలో చేసి పంపిన తీర్మానంపై లోక్ స‌భ‌లో సుధీర్ఘ చ‌ర్చ జ‌రిగిన అనంత‌రం  అమ‌రావ‌తి బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి  అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం (ఏప్రిల్ 2) ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. లోక్ స‌భ‌లో బిల్లు ఆమోదం పొందిన వెంట‌నే ఆగ‌మేఘాల‌పై బుధవారం (ఏప్రిల్ 1) రాత్రి ఢిల్లీ వ‌చ్చిన మంత్రి లోకేష్ కూట‌మి పార్టీ ఎంపీల‌ను అభినందించారు.  అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పిస్తూ లోక్ స‌భ ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డిందని లోకేష్ పేర్కొన్నారు.  

కాగా ఢిల్లీకి చేరుకున్న  మంత్రి నారా లోకేశ్‌కు  తెలుగుదేశం ఎంపీలు ఘన స్వాగతం పలికారు.   లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందిస్తూ..  అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన లోకేష్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందగానే చప్పట్లతో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే హస్తినకు బయలుదేరిన లోకేష్ గురువారం (ఏప్రిల్ 2)  రాజ్యసభలో అమరావతిపై జరిగే చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...