చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు...
posted on May 30, 2017 12:00PM

తండ్రి ముఖ్యమంత్రి... కొడుకు మంత్రి... ఇద్దరి మధ్యా 30ఏళ్లపైనే ఏజ్ గ్యాప్. ఒకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... మరొకరు ఆయన తనయుడు నారా లోకేష్... చంద్రబాబు వయసు ప్రస్తుతం 67 సంవత్సరాలు... లోకేష్ ఏజ్ సుమారు 34ఏళ్లు... కానీ ఇద్దరి పనితీరులో భారీ వ్యత్యాసం. 67ఏళ్ల వయసులోనూ చంద్రబాబు.... నవ యువకుడిలా పరిగెడుతుంటే... ఆయన తనయుడు లోకేష్ మాత్రం తండ్రి వేగాన్ని అందుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. ఇది ఎవరో ప్రత్యర్ధులు అన్న మాట కాదు... స్వయంగా నారా లోకేషే ఒప్పుకున్న నిజం...
మహానాడు వేదికగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన లోకేష్... ఆయనతో పోటీ పడటం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు. నవ యువకులకు కూడా అసూయ పుట్టేలా ఆయన కష్టపడతారని పొగడ్తలతో ముంచెత్తారు. యువకుడినైనా తానే...ఆయనతో పోటీ పడలేకపోతున్నాని చెప్పారు. చంద్రబాబు వేగాన్ని అందుకోవడానికి తామంతా ఆపసోపాలు పడుతున్నామన్నారు. 67ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని లోకేష్ అన్నారు. ఆర్ధిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని పైకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని తండ్రిపై... లోకేష్ ప్రశంసలు వర్షం కురిపించారు.
లోకేష్ వ్యాఖ‌్యలు కొంత ఆశ్చర్యం కలిగించినా... ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఉన్నంత యాక్టివ్‌గా మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 67ఏళ్ల ఏజ్‌లో కూడా ఆయన పాతికేళ్ల యువకుడిలా పరిగెడుతున్నారు. ఆయన తన శరీరాన్ని అదుపులో పెట్టుకున్న తీరు... అందరికీ ఆదర్శమే. అంతేకాదు రాజకీయాల్లో ఎనర్జిటిక్ లీడర్లనే జనం లైక్ చేస్తారు. బాహుబలిలా ఉండకపోయినా ఫర్లేదు కానీ... చురుగ్గా లేకపోతే మాత్రం అస్సలు ఇష్టపడరు. అందుకే చంద్రబాబు వయసు మీదకొచ్చేకొద్దీ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తన పనితీరుతో యువతకే చెమటలు పట్టిస్తున్నారు. అందుకు లోకేష్ వ్యాఖ‌్యలే రుజువు. మరి మీరేమంటారు?