అన్న క్యాంటీన్‌లో...బువ్వకు భువనమ్మ...భూరి విరాళం!

posted on: Apr 18, 2026 4:28PM

 

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం ఈనెల 20న జరగనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

రోజూ లక్షలాదిమంది పేదల ఆకలిని తీరుస్తున్న అన్న క్యాంటీన్లకు ఏటా రూ. 50 లక్షల రూపాయల విరాళం అందచేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. అన్న క్యాంటీన్లకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రభుత్వానికి ఇంతకుముందే కోటి రూపాయల విరాళం అందచేశారు. 

అన్న క్యాంటీన్లలో సీఎం చంద్రబాబుతో కలిసి స్వయంగా ఆమె భోజనాలు వడ్డిస్తుంటారు. దీనికి తోడు చంద్రబాబు జన్మదినోత్సవం వేళ ఏటా రూ. 50లక్షల విరాళం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమమని ఆమె కొనియాడారు. 

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మహత్తర కార్యక్రమానికి మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో విరాళం అందించామన్నారు. ఇటీవల తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ. 44 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. నారా  దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ విరాళం అందిస్తూ, చంద్రబాబు కుటుంబం స్వయంగా అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఈ నిర్ణయంతో అన్నక్యాంటీన్లో పెడుతోన్న బువ్వకు భువనమ్మ చేస్తోన్న ఈ యాభై లక్షల సాయం ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...