Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెపోలియన్ నియంతే కాదు.. ప్రపంచ సంస్కరణల చిరునామా
posted on: May 13, 2026 3:49PM

ప్రపంచ చరిత్ర పుటలను తిరగేస్తే యుద్ధ తంత్రాలలోనూ, పాలనా సంస్కరణలలోనూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి నెపోలియన్. ఆయన మరణించి రెండు శతాబ్దాలు దాటిపోయింది. కచ్చితంగా చెప్పాలంటే నెపోలియన్ మరణించి 205 ఏళ్లయ్యింది. అయినా నేటికీ నేటికీ ప్రపంచంలోని పలు దేశాలు ఆయన నిర్మించిన వ్యవస్థల పునాదుల పైనే నడుస్తున్నాయి. ఫ్రాన్స్ చక్రవర్తిగా ఎదిగిన ఈ చిన్న కార్పొరల్ కేవలం యుద్ధరంగంలోనే కాదు, రాజకీయ, సామాజిక రంగాలలో కూడా ఒక యుగకర్తగా నిలిచిపోయారు. యుద్ధ తంత్రాలలో దూకుడు, ఆశయాల సాధనలో పట్టుదల, పరిపాలనలో అద్భుత సంస్కరణలు.. ఈ మూడింటి కలయికే నెపోలియన్‌ను చరిత్రలో అజరామర వ్యక్తిగా మార్చింది.
ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రాన్స్ అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్న తరుణంలో.. కోర్సికా అనే చిన్న దీవిలో పుట్టిన ఒక సాధారణ ఆర్టిలరీ అధికారి దేశ భవిష్యత్తును తన భుజాన వేసుకున్నారు. 1799లో అధికారాన్ని చేజిక్కించుకున్న నెపోలియన్ కేవలం ఐదేళ్లలోనే అంటే 1804 నాటికి తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకునే స్థాయికి ఎదిగారు. విప్లవం తెచ్చిన అరాచకత్వాన్ని రూపుమాపి, ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఆయన రూపొందించారు. కేవలం సైనిక విజయాల ద్వారానే కాకుండా.. సమానత్వం, ప్రతిభకు పట్టం కట్టే విప్లవ సిద్ధాంతాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆయన ప్రజల మన్ననలు పొందారు.
నెపోలియన్ సాధించిన ఎన్నో విజయాల్లో నెపోలియన్ కోడ్ లేదా సివిల్ కోడ్ అత్యుత్తమమైనది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. యుద్ధాలు కాలక్రమేణా మరుగున పడిపోవచ్చు కానీ.. ఆయన రూపొందించిన ఈ చట్టాల సామ్రాజ్యం మాత్రం నేటికీ అజేయంగా నిలిచి ఉంది. చట్టం ముందు అందరూ సమానులేననీ, ప్రతి వ్యక్తికి ఆస్తి హక్కు ఉంటుందని ఆయన చాటిచెప్పారు. అంతకుముందు ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసి, మతపరమైన అంశాల నుంచి పౌర చట్టాలను వేరు చేశారు. వివాహం, విడాకులు వంటి వ్యక్తిగత అంశాలను చర్చి నియంత్రణ నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ప్రజలు అనుసరిస్తున్న చట్టవ్యవస్థలకు ఈ నెపోలియన్ కోడ్ ప్రాథమిక నమూనాగా నిలుస్తోంది.
సంస్థాగత నిర్మాణంలో నెపోలియన్ వేసిన అడుగులు ఆధునిక రాజ్యాలకు దిక్సూచిగా మారాయి. నేటికీ ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ నెపోలియన్ దూరదృష్టికి నిదర్శనం. అలాగే విద్యారంగంలో లిసే వ్యవస్థను ప్రవేశపెట్టి.. ప్రతిభావంతులైన యువతను దేశం కోసం సిద్ధం చేయాలని ఆయన ఆకాంక్షించారు. మెట్రిక్ కొలతల వ్యవస్థను ఐరోపా అంతటా ప్రచారం చేయడం ద్వారా వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఏకరూపతను తీసుకువచ్చారు. ఆయన నిర్మించిన రహదారులు, పోస్టల్ వ్యవస్థ, పన్నుల విధానం ఆధునిక యూరప్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి.
భౌగోళిక రాజకీయాల్లో కూడా నెపోలియన్ నిర్ణయాలు ప్రపంచ రూపురేఖలను మార్చాయి. 1803లో లూసియానా ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించడం ద్వారా అమెరికా వైశాల్యం ఒక్కసారిగా రెట్టింపు అయింది. ఈ చారిత్రక ఒప్పందం జరగకపోయి ఉంటే.. నేటి అమెరికా ఇంతటి శక్తిమంతమైన దేశంగా ఉండేది కాదంటారు చరిత్రకారులు. అలాగే ఈజిప్ట్ దండయాత్ర సమయంలో ఆయన సైనికులతో పాటు శాస్త్రవేత్తలను కూడా తీసుకెళ్లడం ఒక అద్భుతమైన నిర్ణయం. దీని ఫలితంగానే రొజెట్టా స్టోన్ లభ్యమై, ప్రాచీన ఈజిప్ట్ లిపిని అర్థం చేసుకునే వీలు కలిగింది. తద్వారా ఈజిప్టాలజీ అనే నూతన శాస్త్రవిభాగం పురుడుపోసుకుంది.
నెపోలియన్ కేవలం సంస్కరణకర్త మాత్రమే కాదు.. అజేయమైన యుద్ధ వీరుడు కూడా. 1805లో జరిగిన ఆస్టర్లిట్జ్ యుద్ధం సైనిక చరిత్రలోనే ఒక అద్భుతం. తనకంటే పెద్దదైన శత్రు సైన్యాన్ని వ్యూహత్మకంగా ఓడించడం ద్వారా ఆయన తన మేధస్సును చాటుకున్నారు. అయితే, 1812లో రష్యాపై చేసిన దండయాత్ర ఆయన జీవితంలో అతిపెద్ద తప్పిదంగా మారింది. కఠినమైన చలికాలం, ఆహార కొరత కారణంగా సుమారు ఆరు లక్షల మంది సైనికులతో వెళ్లిన ఆయన సైన్యం చివరకు నామమాత్రంగా మిగిలిపోయింది. ఇది ఆయన పతనానికి ఆరంభమైంది.
చివరికి 1815లో వాటర్లూ యుద్ధంలో ఓటమి పాలైన నెపోలియన్, సెయింట్ హెలెనా దీవికి ప్రవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ తన చివరి రోజుల్లో కూడా తన జీవిత విశేషాలను రికార్డు చేస్తూ, తన చరిత్రను తానే మలచుకున్నారు. 1821 మే 5న ఆయన కన్నుమూశారు. నెపోలియన్‌ను కొంతమంది నియంతగా విమర్శిస్తే, మరికొంతమంది ఆధునిక ఐరోపా నిర్మాతగా కొనియాడుతారు. ఏది ఏమైనా, ఆయన యుద్ధాలు సృష్టించిన ప్రాణనష్టం ఒక చేదు నిజమైతే, ఆయన సృష్టించిన చట్టాలు మరియు సంస్థలు నేటి మానవ జీవనశైలిని ప్రభావితం చేస్తున్నాయన్నది అక్షర సత్యం.
చివరిగా.. నెపోలియన్ ఒక వ్యక్తిగా మరణించి ఉండవచ్చు కానీ, ఆయన ప్రవేశపెట్టిన వ్యవస్థల రూపంలో నేటికీ సజీవంగానే ఉన్నారు. ప్రపంచాన్ని జయించాలనుకున్న ఎందరో చరిత్రలో కలిసిపోయారు, కానీ నెపోలియన్ మాత్రం తను నిర్మించిన 'సంస్థాగత ఫర్నిచర్' ద్వారా ప్రతిరోజూ మనల్ని పలకరిస్తూనే ఉంటారు. యుద్ధ విజయాల కంటే కూడా సంస్థలు, ఆలోచనా విధానాలే శాశ్వత సామ్రాజ్యాలను నిర్మిస్తాయని నెపోలియన్ జీవితం మనకు నిరూపిస్తోంది. అందుకే రెండు శతాబ్దాల తర్వాత కూడా ప్రపంచం నెపోలియన్ గురించి చర్చించుకుంటూనే ఉంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






