నంద్యాల టీడీపీదేనా..?

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులును ఒడ్డాయి. ప్రచారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు..ఆ పర్వం ముగియడంతో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా..ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు..మధ్యాహ్నానికే 60 శాతం పోలింగ్ నమోదు అయ్యిందంటే ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చెప్పవచ్చు.

 

ఓటు వేసి వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారా అని చర్చించుకోవడం సహజం. అందుకు తగ్గట్టుగానే చిన్నా, పెద్దా ఇలా నలుగురు కలిస్తే చర్చ అంతా నంద్యాలలో ఏ జెండా ఎగురుతుందనే. ప్రజల మాటలను బట్టి చూస్తే టీడీపీ 8 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందుతుందట. టీడీపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లగా..జగన్ కీలక నేతలను తనతో పాటే ఉంచుకుని కేవలం ఓటర్లను కలవడానికే ప్రాధాన్యతనిచ్చారు.

 

మరో వైపు ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఏజెంట్‌‌ని నియమించి..బూత్ స్థాయి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు ఓటుకు రూ.1000 నుంచి 2000 వరకు అధికార పార్టీ ముట్టజెప్పిందని గుసగుసలు వనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా అంతటిది ఒకదారైతే నంద్యాలది మరోదారి..ఎందుకంటే ఇక్కడి ప్రజలు సౌమ్యులు..తిట్టుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం అన్న మాటలు నంద్యాలలో చెల్లవు. ఫ్యాన్ పార్టీ ప్రచారం స్టార్ట్ చేసింది మొదలు ఎండ్ చేసే వరకు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పట్ల ప్రజల్లో కాస్తంత వ్యతిరేకత తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద టీడీపీకి 55 శాతం, వైసీపీకి 35శాతం, కాంగ్రెస్‌కు 6 శాతం ఓట్లు లభించవచ్చని పరిశీలకుల అంచనా.