నంద్యాల టీడీపీ అభ్యర్ధి ఖరారు... ప్రకటించేది అప్పుడే..!

టీడీపీలో నంద్యాల బైపోల్‌ పంచాయతీ తెగేలా కనిపించడం లేదు. అభ్యర్ధి ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. టికెట్ కోసం భూమా, శిల్పా వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వివాదానికి తెరదించేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా కొలిక్కిరావడం లేదు. దాంతో నిర్ణయం తీసుకోలేక హైకమాండ్‌ తలలు పట్టుకుంటోంది.

 

నంద్యాల టికెట్‌ కోసం పట్టుబడుతోన్న భూమా, శిల్పా వర్గాలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ చర్చలు జరిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇరువర్గాలూ తమ వాదనలు వినిపించారు. అయితే ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చాక చూద్దామంటూ సీఎం నిర్ణయాన్ని వాయిదా వేశారు. కానీ టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న శిల్పా బ్రదర్స్‌... మరోసారి అధినేతను కలిసి తమ వాదన వినిపించారు. 2014లో టీడీపీ తరపున తానే పోటీ చేశానని, ఇప్పుడు కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని, లేదంటే కేడర్ చేజారిపోతుందని శిల్పా మోహన్‌రెడ్డి అంటున్నారు. 

 

ఇటు మంత్రి భూమా అఖిలప్రియ కూడా చంద్రబాబును కలిసి.... తమ కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని మరోసారి కోరారు. సంప్రదాయం ప్రకారం తమకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పైకి ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్‌ అంటున్నా.... టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే భూమా వర్గంతో కళా వెంకట్రావ్‌ జరిపిన చర్చల్లో  కేంద్ర మంత్రి సుజనాచౌదరి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అఖిలప్రియను బుజ్జగించి, శిల్పాకు టికెట్‌ కేటాయించేందుకేనంటూ టాక్‌ వచ్చింది. కానీ భూమా వర్గం వెనక్కితగ్గకపోవడంతో, చర్చలు కొలిక్కిరాలేదని చెబుతున్నారు. దాంతో అమెరికా పర్యటన తర్వాతే నంద్యాల అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu