నాంపల్లి అగ్ని ప్రమాదం...కంటతడి పెట్టిస్తున్న బాధితుడి ఆడియో

posted on: Jan 30, 2026 4:04PM

 

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద ఘటన మరింత కలచివేసే విషయం బయటపడింది. ఫర్నిచర్ షాప్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఇంతియాజ్, మృతి చెందే కొద్దిక్షణాల ముందు చేసిన ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై తీవ్ర విషాదం నెలకొంది.

ఆ ఆడియోలో ఇంతియాజ్ తీవ్ర భయాందోళనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. “ఫైర్ చాలా ఎక్కువగా ఉంది… బయటకు రాలేని పరిస్థితి… ఎక్జిట్ రూట్లు అన్నీ మూసుకుపోయాయి” అంటూ అతడు ప్రాణాల కోసం వేడుకున్న మాటలు వినిపిస్తున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో షాప్ అంతా దట్టమైన పొగతో నిండిపోయిందని, ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిందని ఆ కాల్‌ లో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం, అగ్నిప్రమాద సమయంలో షాప్‌లోని ప్రధాన ఎక్జిట్ మార్గాలు మూసి వుండటంతో లోపల చిక్కుకున్న వారు బయటకు రాలేకపోయారు. భద్రతా నిబంధన లకు విరుద్ధంగా ఎక్జిట్ రూట్లను బ్లాక్ చేయడం, అగ్నిమాపక ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడమే ఈ ప్రాణనష్టం‌కు ప్రధాన కారణమని పలు ఆరోపణలు  వినిపిస్తున్నాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అగ్నిప్రమాదం చెలరేగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా, మంటలు తీవ్రంగా వ్యాపించిన తర్వాతే వారు ఘటనాస్థలికి చేరుకున్నా రన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్పటికే షాప్ అంతా మంటల్లో చిక్కుకుని, లోపలున్నవారిని రక్షించే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలోని వాణిజ్య భవనాల్లో అమలవుతున్న ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

అనుమతులు, లైసెన్సులు ఉన్నప్పటికీ, భద్రతా నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. షాప్ యజమాని నిర్లక్ష్యం, ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన, ఎక్జిట్ మార్గాల మూసివేత వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. బాధితుడి చివరి కాల్ రికార్డింగ్‌ను కీలక ఆధారంగా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశా మని అధికారులు తెలిపారు. ఒకవైపు విచారణ కొనసాగుతుండగా,మరో వైపు ప్రాణాలు కోల్పోయిన ఇంతియాజ్ కుటుంబం ఆ ఆడియో విని గుండెల విసేలా విలపిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...