Latest News

నాంపల్లి అగ్నిప్రమాదం...చివరికి విషాదమే మిగిలింది

posted on: Jan 25, 2026 11:59AM

 

హైదరాబాదు నగరంలోని నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాం భవనంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్న పిల్లలతో పాటు ముగ్గురు పెద్దలు మృతి చెందడం నగరాన్ని విషాదంలో ముంచింది. దాదాపు 22 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం భవనంలో చిక్కుకుపోయిన ఐదుగురి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీస్ శాఖలు రంగంలోకి దిగినప్పటికీ, భవనం సెల్లార్ నుంచి బయటకు వస్తున్న దట్టమైన పొగలు, తీవ్ర ఉష్ణోగ్రతలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. 

లోపలికి ప్రవేశించడం సాధ్యం కాకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో బేబీ (45) – మహిళ అఖిల్ (11) – బాలుడు ప్రణీత్ (8) – బాలుడు ఇంతియాజ్ (28) – పురుషుడు హబీబ్ (32) – ఫర్నిచర్ షాప్ డ్రైవర్ ఈ ఐదుగురు మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదం సమయంలో భవనంలో చిక్కుకుపోయిన వారిలో *బేబీ గుల్బర్గా (మహిళా వాచ్మెన్)*తో పాటు ఇంతియాజ్, హబీబ్, చిన్నారులు అఖిల్, ప్రణీత్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

రంద్రం చేసి మృతదేహాల వెలికితీత

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగలు ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించిన వెంటనే పక్క భవనం నుంచి రంద్రం చేసి లోపలికి వెళ్లి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. వెలికితీసిన మృతదేహాలను వెంటనే ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఈ అగ్నిప్రమాదం తీవ్రతకు భవనం పూర్తిగా దెబ్బతింది. 

గంటల తరబడి పొగలు, వేడి సెగలు కొనసాగడంతో భవనం నిర్మాణ భద్రతపై సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ఈ నేపథ్యంలో భవనం పరిస్థితిని పరిశీలిం చేందుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది.ప్రాథమికంగా భవనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని అంచనా వేస్తున్న అధికారులు, కూల్చివేత తప్పనిసరి కావొచ్చని సూచిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతి ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు.

అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఫర్నీచర్ పెట్టడం వల్లనే ప్రమాదం తీవ్రత పెరిందన్నారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, ఫర్నీచర్‌తో పాటు కెమికల్స్‌ను కూడా సెల్లార్‌లో పెట్టారన్నారు. షాపు యజమాని సతీష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చాని ఫైర్ డీజీ  తెలిపారు

google-ad-img
    Related Sigment News
    • Loading...