Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ నలుగురిని చంపింది ఒక్కడే...నల్గొండ ఫ్యామిలీ మర్డర్ ట్విస్ట్!
posted on: Jun 27, 2026 10:57AM

తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి కేసు మిస్టరీని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో ఒకే ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైన ఆ నాలుగు మృతదేహాల వెనుక ఉన్నది ఆత్మహత్య కాదని, అది అత్యంత కిరాతకమైన సామూహిక హత్య అని దర్యాప్తులో తేలింది.
ఈ ఘోరానికి మృతురాలి అక్క కూతురు, అల్లుడే అసలైన సూత్రధారులుగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. డబ్బు, బంగారంపై ఆశ, వ్యక్తిగత కక్షల వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 22 రాత్రి నివాసం నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, అక్కడ భీభత్సమైన దృశ్యం కనిపించింది.
మృతులను ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారం చేసే మహ్మద్ సుల్తాన్ (45), ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆయన భార్య హసీనా (40), వారి కుమారుడు ఏసీ టెక్నీషియన్ ముజమ్మిల్ (20), మరియు ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల చిన్నారి కుమార్తె అఫ్సరాగా గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో పదునైన ఆయుధంతో దాడి చేయడం వల్లే వారు మరణించారని తేలడంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో క్లూస్ టీమ్, సైబర్ క్రైమ్ మరియు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. ఈ కిరాతక హత్యలకు పాల్పడిన హసీనా మేనకోడలు తబస్సుమ్ (28), ఆమె భర్త కార్ డ్రైవర్ సయ్యద్ అస్లాం (28), అతడి స్నేహితుడు మహ్మద్ సోహైల్ (26), మరియు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ యజమాని హేమంత్ కుమార్ (28)లను నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో నిందితుడు అస్లాం చెప్పిన నిజాలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అస్లాం, తబస్సుమ్ దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. గతంలో హసీనా వద్ద అస్లాం రూ. 1 లక్ష అప్పుగా తీసుకుని వడ్డీ చెల్లిస్తున్నాడు. ఇటీవల తబస్సుమ్ గర్భవతి కావడం, టాక్సీ బిజినెస్ కోసం కొత్త కారు కొనాలని అనుకోవడంతో అస్లాం మరోసారి హసీనాను అప్పు అడిగాడు.
అయితే, పాత అప్పు తీర్చకుండా కొత్తది ఇవ్వలేనని హసీనా ఖరాకండిగా తిరస్కరించడమే కాకుండా, పాత బాకీ వెంటనే తిరిగి ఇవ్వాలని నిలదీసింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక, హసీనా ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకోవాలనే దురాశతో అస్లాం హత్యకు ప్లాన్ చేశాడు. క్రైమ్ ఎలా చేయాలో, హత్య చేసి పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్‌లో వీడియోలు చూసి మరీ పథకం రచించాడు.
పథకం ప్రకారం జూన్ 19న అస్లాం నల్గొండకు చేరుకున్నాడు. అర్థరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో కాంపౌండ్ వాల్ దూకి హసీనా ఇంట్లోకి ప్రవేశించి మాటు వేశాడు. జూన్ 20 తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హసీనా నిద్రలేచి తలుపు తీయగానే, అస్లాం కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.
ఆ శబ్దానికి అడ్డువచ్చిన భర్త సుల్తాన్‌ను సైతం నరికి చంపాడు. తల్లిదండ్రుల అరుపులు విని రూమ్ నుండి బయటకు వచ్చిన కుమారుడు ముజమ్మిల్ ఇనుప రాడ్‌తో అస్లాంపై ఎదురుదాడికి దిగాడు. ఈ ఘర్షణలో అస్లాం కాళ్లకు, చేతి వేలికి గాయాలైనప్పటికీ, ముజమ్మిల్‌ను కత్తితో పదేపదే పొడిచి కిరాతకంగా హతమార్చాడు. చివరకు ఎలాంటి సాక్ష్యం మిగలకూడదనే ఉద్దేశంతో, గదిలో బెడ్ కింద దాక్కున్న 12 ఏళ్ల చిన్నారి అఫ్సరాను బయటకు లాగి గొంతు కోసి చంపేశాడు.
నలుగురిని దారుణంగా ఊచకోత కోసిన తర్వాత, అస్లాం అల్మారాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను దొంగిలించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సోహైల్ సాయంతో హైదరాబాద్ సరూర్ నగర్‌లోని హేమంత్ కుమార్ జ్యువెలరీ షాపులో ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 5.30 లక్షలు తీసుకుని పరారయ్యాడు.
నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, రూ. 3 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు మొబైల్ ఫోన్లు, ఐదు తులాల బంగారం మరియు భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ గుండెలవిసే ఘోర ఉదంతాన్ని ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.


.webp)
.webp)


