పాపం నహీద్... పాడటం పాపమని తెలియక మహాపాపం చేసింది!

posted on: Mar 15, 2017 2:58PM

ఢిల్లీలోని జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో ఆ మధ్య ఏం జరిగింది? దేశానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీ తీశారు! హిందూస్థాన్ ని ముక్క ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేశారు! వాళ్ల పై కేసులు పెట్టింది ప్రభుత్వం. వెంటనే రంగంలోకి దిగిన మీడియా, మేదావులు ఏ ఆస్త్రాన్ని బయటకు తీశారు? భావప్రటకన అస్త్రాన్ని! దేశంలో వుంటోన్న జనం దేశానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయొచ్చని అప్పట్లో సెలవిచ్చారు! కాని, విచిత్రంగా ఇప్పుడు అదే భావప్రకటనా స్వాతంత్ర్యానికి హాని ఏర్పడి ఒక పదహారేళ్ల ముస్లిమ్ అమ్మాయి ఇబ్బందిపడుతోంటే... ఎవ్వరూ పెద్దగా స్పందించటం లేదు!

 

నహీద్ అఫ్రీన్... ఈమెవరో హిందీ ఛానల్స్ చూసేవారందరికీ తెలుసు! ప్రఖ్యాత మ్యూజికల్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ లో పాల్గొంటోంది. ఆసోమ్ కి చెందిన నహీద్ వయస్సు పదహారేళ్లు. అద్బుతంగా పాడుతుంది. అంతే కాదు, ఈ మధ్య ఒక హిందూ భజన్ ని కూడా ఆలాపించింది. అప్పట్నుంచే ఆమెకు అగచాట్లు మొదలయ్యాయి! నహీద్ అసలు ఇక మీదట పాడనే పాడవద్దంటూ ఫత్వా జారీ చేశారు అసోమ్ మత చాందసవాదులు. ఏకంగా 46 ఇస్లామిక్ సంస్థలు నహీద్ ను టార్గెట్ చేశాయి. ఆమె ఇక మీదట పాటలు పాడితే అస్సలు బావుండదని హెచ్చరించే పాంప్లెట్లు అసోమ్ అంతటా ప్రత్యక్షమయ్యాయి!

 

ముస్లిమ్ మత పెద్దలు నహీద్ పై ఆగ్రహం తెచ్చుకోటానికి కారణం ఆమె షరియా చట్టం ప్రకారం పాపమైన సంగీతం ఆలపించటమే! దాని ప్రకారం పాడటం, ఆడటం, నటించటం... అన్నీ తప్పే! అందుకే, నహీద్ నోరు మూసుకోవాలని ఆర్డర్ జారీ చేశారు అసోమ్ మత పెద్దలు. అక్కడున్నది అదృష్టవశాత్తూ బీజేపి ప్రభుత్వం కావటంతో ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్వయంగా ఫోన్ చేసి నహీద్ కు భరోసా ఇచ్చారట. తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారట! నహీద్ కూడా తాను మొదట్లో షాకైనా ఇప్పుడు సంగీతం ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోబోనని తెగేసి చెబుతోంది!

 

అసోమ్ లోని ఇస్లామ్ మత ఛాందసవాదులు బెదిరిస్తే నహీద్ భయపడుతుందా లేదా అన్నది తరువాతి సంగతి.... ముందసలు ఇదంత పెద్ద విషయమేం కాదన్నట్టు ఊరుకుంటోన్న మీడియాను ఏమనాలి? అలాగే, అఫ్జల్ గురు లాంటి ఉగ్రవాదికి మద్దతు తెలిపే స్వేచ్ఛ కూడా అందరికీ వుంటుందని వాదించిన మేదావులు ఒక అమ్మాయి అద్భుతంగా పాడుతోంటే... అడ్డుకోవటం ఏంటని ఎందుకు ప్రశ్నించటం లేదు? అసలు ఒకవేళ అసోమ్ లో బీజేపి ప్రభుత్వం కాకుండా ఇతర సెక్యులర్ పార్టీల ప్రభుత్వం వుండి వుంటే పరిస్థితి ఎలా వుండేది? నహీద్ ఎదుర్కొంటున్నట్టే దశాబ్దాలుగా ఛాందసవాదుల టార్చర్ అనుభవిస్తోంది ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్. అయినా కూడా చాలా సందర్బాల్లో మన సెక్యులర్ ప్రభుత్వాలు ఆమెకి తగినంత రక్షణ ఇవ్వకుండా చేతులెత్తేశాయి!

 

మీడియా, మేధావులు, లౌకికవాదులమని చెప్పుకునే నేతలు అన్ని మతాల్లోని ఛాందసవాదాన్ని గట్టిగా ఖండిస్తేనే దేశం వేగంగా ముందుకుపోయేది. లేదంటే మధ్య యుగాల నాటి ఆటవిక న్యాయం ఇలాగే కొనసాగుతుంది!

google-ad-img
    Related Sigment News
    • Loading...