Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలినేని మండలికి, నాగబాబు రాజ్యసభకు?
posted on: May 20, 2026 10:37AM

జనసేన నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబు రాజ్యసభకు వెళ్లనున్నారా? అందు కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేయనున్నారా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రచారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న ఆలోచనలో జనసేన అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
మాములుగా అయితే జనసేన తరఫున లింగమనేని రమేష్ ని రాజ్యసభకు పంపుతారని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు జనసేనాని ఆయనకు గతంలో హామీ కూడా ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం లింగమనేని రామేష్ ను కాదని నాగబాబును రాజ్యసభకు పంపేయోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే నాగాబు జబర్దస్త్ స్టేజ్ పైకి రీ ఎంట్రీ ఇచ్చారు. మళ్లీ ఆయన ఢిల్లీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే ఈ వినోద కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది.
ఇక ఢిల్లీలో చక్రం తిప్పేంత సామర్థ్యం నాగబాబుకు ఉందా? అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఢిల్లీ రాజకీయాలలో చురుకుగా, క్రియాశీలంగా ఉండి, పార్టీ వాయిస్ వినిపించాలంటే.. భాష చాలా ముఖ్యం. మరి హిందీ భాషలో నాగబాబు ప్రావీణ్యం ఎంత అన్న సందేహం వ్యక్తమౌతోంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే నాగబాబు తన కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు తికమక పడుతుంటారు. నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో నాగబాబును బాగా తప్పు పడుతుంటారనీ పార్టీ వర్గాల్లోనే ఒక అభిప్రాయం ఉంది. మరి అలాంటి నాగబాబు జాతీయ స్థాయిలో రాణింపు సాధ్యమయ్యే పనేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
ఇక ఇటు ఒంగోలు రీజియన్‌లో బలమైన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నాగబాబు గనుక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తే.. ఖాళీ అయ్యే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కూటమి తరఫున బాలినేనికి కేటాయించే అవకాశం ఉంది.
ఇక్కడింకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒంగోలు ఎమ్మెల్యే దామంచర్ల జనార్ధన్ తో బాలినేనికి అస్సలు సరిపడదు. ఇద్దరూ ఒకే కూటమికి చెందిన నేతలే అయినా ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. బాలినేని ఇంకా వైసీపీలో ఉన్నట్టే తనపై నిందలు వేస్తున్నారని అంటారు జనార్ధన్. మరి ఈ సమస్యకు పరిష్కారం ఈ ఎమ్మెల్సీ పదవి ద్వారా అయినా పరిష్కారం దొరుకుతుందా? అన్నది తేలాల్సి ఉంది.
బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అనుభవంతో ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరులో జనసేనకు ఇంఛార్జ్ లేరు. బాలినేనిని మండలికి పంపడం ద్వారా ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందా? అన్నది తేలాల్సిఉంది. ఇటీవల బాలినేని, సీఎం చంద్రబాబు నాయుడితో కూడా భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న సమాచారమే అయినప్పటికీ, దీనిపై జనసేన అధిష్టానం లేదా కూటమి పెద్దల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





