నాగబాబు రాజకీయం .. వ్యూహమా? అయోమయమా?
posted on: Mar 16, 2026 3:44PM
.webp)
మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన కీలక నేత రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? లేక అయోమయంలో ఉన్నారా అన్న అనుమానాలు కలగకమానవు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఇప్పటి వరకూ విజయం సాధించింది లేదు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి అది వేరే సంగతి. ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులపై మాత్రం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికలలో ఆయన తొలి సారిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికలలో జనసేన కూడా ఏమంత ప్రభావం చూపకపోవడంతో నాగబాబు పరాజయం పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు. జనసేన అధినేత సోదరుడు, ఆ పార్టీలో కీలక నేత అయి ఉండి కూడా ఆయనకు పోటీకి అవకాశం దక్కకపోవడం అప్పట్లో రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. అది పక్కన పెడితే.. 2025 ఏప్రిల్ లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని ప్రకటించారు.
అయినా ఎమ్మెల్సీ అయ్య దాదాపు ఏడాది కావస్తున్నా నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. ఇక ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో జనసేనాని ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాలిస్తే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి నేతగా నాగబాబు నిలుస్తారు. ఇక ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.
అదలా ఉండగా నాగబాబు ప్రస్తుతం తన దృష్టినంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంపై కేంద్రీకృతం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల వేదికగా నాగబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జనసేన వర్గాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తత టర్మ్ లో ఆయన ఏపీ కేబినెట్ లో చేరుతారా? లేక రాజ్యసభకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుంటారా? అన్న చర్చల నడుమ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎచ్చర్ల నుంచి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారం నాగబాబు రాజకీయ అడుగులు ఎటు పడుతున్నాయన్న ప్రశ్నకు తావిస్తోంది. ఎచ్చర్లలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన ఎచ్చర్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావించినా.. ప్రస్తతం ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఆ సీటును నాగబాబు కోసం త్యాగం చేస్తుందా? అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో నాగబాబు ఒకే సమయంలో మూడు రకాల ప్రయత్నాలు చేయడం ఆయనలోని కన్ఫ్యూజన్ ను బయటపెట్టడమే కాకుండా జనసేన వర్గాలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద నాగబాబు ది రాజకీయ వ్యూహమా లేక అయోమయమా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనసేన వర్గీయులే అంటున్నారు.


.webp)
.webp)


